Share News

Medical College: మరో ప్రైవేటు వైద్య కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:52 AM

తెలంగాణలో మరో కొత్త ప్రైవేట్‌ వైద్యవిద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందులో 150 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతులు జారీ చేసింది.

Medical College: మరో ప్రైవేటు వైద్య కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

  • 27కు చేరిన ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు

హైదరాబాద్‌, అక్టోబరు16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మరో కొత్త ప్రైవేట్‌ వైద్యవిద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందులో 150 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో రంగారెడ్డి జిల్లాలో ఈ కొత్త నోవా మెడికల్‌ కళాశాల ఏర్పాటైంది. కొత్త కళాశాలలో మొత్తం 150 సీట్లలో 50ు అంటే 75 సీట్లు కన్వీనర్‌ కోటా కిందకు వెళ్తాయి. రెండో రౌండ్‌ కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత 20-25 సీట్లు ఆ కోటా ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దాంతో ఆ 75 సీట్లు, మిగిలిన ఉన్న ఈ 20-25 సీట్లు కలుపుకొని మొత్తం 95-100 సీట్లు కన్వీనర్‌ కోటాలో ఉంటాయని హెల్త్‌ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.


ఇక కొత్త కళాశాలతో కలిపి రాష్ట్రంలో ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల సంఖ్య 27(ఇటీవల డీమ్డ్‌ యూనివర్సిటీగా మారిన మల్లారెడ్డి గ్రూప్‌కు చెందిన 2 కళాశాలలు కాకుండా)కు చేరింది. కాగా, కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ రెండు రౌండ్లు ముగిసిన తర్వాత కొత్త ప్రైవేట్‌ కళాశాలకు అనుమతులు రావడం గమనార్హం. గత బీఆర్‌ఎస్‌ సర్కారులో అప్పటి సీఎం కేసీఆర్‌కు పక్కనే ఉన్న ఓ సీనియర్‌ నేత, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సమీక్ష సమావేశాల్లో సీఎం రేవంత్‌ పక్కనే ఉండే నేత ఈ కళాశాలకు అనుమతులు రావడం వెనుక కీలక పాత్ర పోషించినట్లు వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఏడాది కొత్తగా అనుమతులు పొందిన 8 వైద్య విద్య కళాశాలల్లో ఈనెల 21 నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ కళాశాలలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించే యోచనలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నట్లు సమాచారం.

Updated Date - Oct 17 , 2024 | 03:52 AM