Share News

Uttam Kumar: ఎస్సీ వర్గీకరణ అమలైతున్న రాష్ట్రాల్లో అధ్యయనం

ABN , Publish Date - Sep 17 , 2024 | 02:28 AM

ఎస్సీ వర్గీకరణ అంశంపై అధ్యయనం చేసేందుకు.. ఇప్పటికే వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

Uttam Kumar: ఎస్సీ వర్గీకరణ అమలైతున్న రాష్ట్రాల్లో అధ్యయనం

మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం

  • పంజాబ్‌,హరియాణా,తమిళనాడులో ఉపసంఘం పర్యటన

  • న్యాయపరమైన అంశాలపై నిపుణుల సలహాలు

  • ఆటంకాలు లేకుండా పకడ్బందీగా ముందుకెళ్లేలా చర్యలు

  • మంత్రి వర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 16, (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అంశంపై అధ్యయనం చేసేందుకు.. ఇప్పటికే వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పంజాబ్‌, హరియాణా, తమిళనాడు రాష్ట్రాల్లో త్వరలోనే ఉపసంఘం పర్యటించనుంది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సోమవారమిక్కడి జలసౌధలో సమావేశమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనరసింహ, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పంచాయతీ రాజ్‌ శాఖామంత్రి సీతక్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ మల్లు రవిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కమిటీ చర్చించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని, దీని అమలు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన అంశాలపై నిపుణులతో సలహాలు తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం వ్యక్తిగతంగాను, అదేవిధంగా సమష్టిగానూ నిఫుణులు, ఇతరుల అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించామన్నారు. పంజాబ్‌, హరియాణా, తమిళనాడు రాష్ట్రాల పర్యటనకు త్వరలోనే వెళ్తామన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 02:28 AM