Share News

Jobs: రెండు నెలల్లో.. మరో 35 వేల ఉద్యోగాలు..

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:16 AM

వచ్చే రెండు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాల దిశగా.. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Jobs: రెండు నెలల్లో.. మరో 35 వేల  ఉద్యోగాలు..

  • విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత

  • వచ్చే ఏడాది నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇంటర్న్‌షిప్‌.. కనీస ప్రమాణాల్లేని ఇంజనీరింగ్‌ కాలేజీల గుర్తింపు రద్దు

  • ఉపాధి లేక వ్యసనాల బారిన పడుతున్న యువత.. బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వచ్చే రెండు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాల దిశగా.. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రంలో కొంత మంది యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలయ్యారని.. ఇటీవల పట్టుబడిన డ్రగ్‌ పెడ్లర్లలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించిందని ఆవేదన వెలిబుచ్చారు. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చడంతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.


బుధవారం ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో బీఎ్‌ఫఎ్‌సఐ (బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌) స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. బీఎ్‌ఫఎ్‌సఐ వెబ్‌సైట్‌ను, కోర్సులతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎ్‌సపీఎస్సీ వెబ్‌సైట్లోనే 30 లక్షల మంది నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకున్నారని, రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు.


డీఎస్సీ, గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో 35 వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని.. ఇందుకు సంబంధించిన అన్ని చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటోందని వివరించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్న యువతను తీర్చిదిద్ది, వారి ఉపాధికి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందు లో భాగంగానే బీఎ్‌ఫఎ్‌సఐ ప్రతినిధులతో చర్చలు జరిపామని, వారు ఇచ్చిన ప్రతిపాదనలతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు డిగ్రీలో చేరిన పదివేల మంది డిగ్రీ విద్యార్థులూ పట్టా పొందే నాటికి.. తగిన నైపుణ్యాలను నేర్చుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని.. 38 కాలేజీల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌, ఇన్సూరెన్స్‌ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఇందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎక్విప్‌ సంస్థ, ఈ కోర్సు సిలబ్‌సను రూపొందించిన బీఆర్‌ఎ్‌సఎఫ్‌ ప్రతినిధులను సీఎం అభినందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.


  • 3 లక్షల మంది వస్తున్నా..

తెలంగాణలో ఏటా మూడు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పొంది కాలేజీల నుంచి బయటకు వస్తున్నా.. పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని సీఎం ఆందోళన వెలిబుచ్చారు. అదే సమయంలో అటు పరిశ్రమలు కూడా తగిన సాంకేతిక నైపుణ్యమున్న ఉద్యోగులు దొరక్క ఇబ్బంది పడుతున్నాయని.. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని చెప్పారు. అందులో భాగంగానే.. డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని ఇంజనీరింగ్‌ కళాశాల్లో విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలను నేర్పడం లేదని, వసతులు ఉండటం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలు ఇలాగే కొనసాగితే వాటి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.


టాటా టెక్నాలజీస్‌ సహకారంతో ఐటీఐలను నవీకరించి ‘అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లు’గా మారుస్తున్నామని చెప్పిన సీఎం.. ఇప్పటికే మల్లేపల్లి ఐటీఐలో దీనికి సంబంధించి పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేసినట్లు వివరించారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ఐటీఐలనూ ఏటీసీలుగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేసి తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివి, ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల చీఫ్‌లుగా ఎదిగిన సత్య నాదేళ్ల, అజీమ్‌ ప్రేమ్‌జీ, శంతను నారాయణ, అజయ్‌బంగా (ప్రపంచ బ్యాంకు చైర్మన్‌) తదితర ప్రముఖులతో డిసెంబర్‌లో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.


మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. రానున్న కొద్ది సంవత్సరాల్లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్స్యూరెన్స్‌ రంగాల్లో ఐదు లక్షల మంది దాకా.. శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుందని చెప్పారు. ఆయా ఖాళీల భర్తీకి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. కాగా..ఎక్విప్‌ సంస్థ ప్రతినిధులు రూ.2.5కోట్ల చెక్కును రేవంత్‌రెడ్డికి అందజేశారు. విద్యార్థుల డేటాతో రూపొందించిన ఎక్విప్‌ స్కిల్‌ పోర్టల్‌ను సీఎం ఆవిష్కరించారు. కాగా, ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ రేవంత్‌రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Sep 26 , 2024 | 03:16 AM