Congress: హస్తినలో సీఎం రేవంత్ బిజీ బిజీ..!!
ABN , Publish Date - Jun 24 , 2024 | 12:33 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క ఉన్నారు. వీరితో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ జత కలువనున్నారు. ఆయన ఈ రోజు ఢిల్లీ వెళుతున్నారు. ముఖ్యనేతలంతా ఢిల్లీలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో ఉన్నారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క ఉన్నారు. వీరితో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ జత కలువనున్నారు. ఆయన ఈ రోజు ఢిల్లీ వెళుతున్నారు. ముఖ్యనేతలంతా ఢిల్లీలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంది. ఆ అంశంపై ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ఆశవాహులు చాలా మంది ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డికి బెర్త్ ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
మంత్రివర్గ విస్తరణ..!!
మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికల గురించి హైకమాండ్‌తో సీఎం రేవంత్ డిస్కష్ చేస్తారు. పోచారం శ్రీనివాస రెడ్డి, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు. 20 మంది వరకు పార్టీలో చేరతారని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతోపాటు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. కొత్త పీసీసీ చీఫ్ నియమించాల్సి ఉంది. సీఎం పదవితోపాటు పీసీసీ చీఫ్ పదవి ఒకరికే ఇవ్వరు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్.. పీసీసీ చీఫ్‌గా ఇన్నాళ్లూ కొనసాగారు. మరొకరికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది.
కేంద్రమంత్రులతో భేటీ..!!
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం కేంద్రమంత్రులను సమయం కోరిందని తెలిసింది. విభజన హామీల అమలు, ఇతర అంశాల గురించి కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించే అవకాశం ఉంది.