Cyber Crime: ఓటీపీ రాకుండానే ఖాతా నుంచి 1.9కోట్లు స్వాహా
ABN , Publish Date - Dec 12 , 2024 | 02:44 AM
తెలంగాణ సైబర్ భద్రత బ్యూరో అప్రమత్తతతో ఓ బాధితుడికి చెందిన కోటి పది లక్షల రూపాయలను పోలీసులు కాపాడగలిగారు. బుధవారం రెండు గంటల 3 నిమిషాలకు ఓ వ్యక్తి ఖాతా నుంచి కోటి 90 లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు సందేశం వచ్చింది.
కోటి పది లక్షలు కాపాడిన సైబర్ పోలీసులు
హైదరాబాద్, డిసెంబరు11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సైబర్ భద్రత బ్యూరో అప్రమత్తతతో ఓ బాధితుడికి చెందిన కోటి పది లక్షల రూపాయలను పోలీసులు కాపాడగలిగారు. బుధవారం రెండు గంటల 3 నిమిషాలకు ఓ వ్యక్తి ఖాతా నుంచి కోటి 90 లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు సందేశం వచ్చింది. ఎలాంటి ఓటీపీ అడగకుండానే తన ఖాతా నుంచి డబ్బు మాయం కావడంతో ఆందోళన చెందిన బాధితుడు సాయంత్రం నాలుగు గంటలకు 1930 నెంబర్ ద్వారా సైబర్ భద్రత బ్యూరోకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన విధుల్లోని అధికారి మౌనిక బ్యాంకింగ్ అనుసరణ(ఫాలోఅప్) బృందాలను అప్రమత్తం చేశారు. వారు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు బాధితుని ఖాతా నుంచి డబ్బు చేరినట్లు గుర్తించారు.
వెంటనే ఆ బ్యాంకు అధికారులతో మాట్లాడి ఖాతాలో ఉన్న 75,69,223 రూపాయలను ఫ్రీజ్ చేయించారు. అప్పటికే మోసగాళ్లు ఆ బ్యాంకు నుంచి వివిధ బ్యాంకులకు 35 లక్షల రూపాయలను బదిలీ చేశారు. దీంతో పోలీసు బృందం లావాదేవీలు జరిగిన బ్యాంకులు అన్నిటిని సంప్రదించి రూ.35 లక్షలను కూడా విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకున్నారు. ఇంకా 79 లక్షల 30 వేల రూపాయలను వివిధ వ్యాలెట్లకు బదిలీ చేయడంతో ఆ డబ్బును కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.. సైబర్ క్రైం బాధితులు డబ్బు పోతే గోల్డెన్ అవర్స్‌లో(అంటే డబ్బు పోయిన తొలి రెండు మూడు గంటల్లో) 1930 కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందని ఆమె తెలిపారు.