OP Services Haltt: రాష్ట్రంలో 24 గంటల పాటు ఓపీ సేవలు బంద్
ABN , Publish Date - Aug 17 , 2024 | 03:51 AM
జూనియర్ డాక్టర్‌పై కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన హత్యాచారానికి నిరసనగా.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆందోళనలు చేపట్టారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా..
ఐఎంఏ పిలుపుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిలిపివేత
నేడు ఉదయం 6 నుంచి రేప్పొద్దున ఆరు గంటల దాకా
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి: వైద్య మంత్రి దామోదర
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు, ఆందోళనలు
ఆర్జీ కర్‌పై దాడి.. బెంగాల్ సర్కారు వైఫల్యం వల్లే!
7వేల మంది గుమిగూడితే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది?
హత్యాచారం జరిగిన ఫ్లోర్‌లోనే మరమ్మతులేమిటి?
ఆస్పత్రిని మూసేయిస్తాం.. జాగ్రత్త: కోల్‌కతా హైకోర్టు
వైద్యసిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల్లోపు ఎఫ్‌ఐఆర్..
ప్రభుత్వాస్పత్రుల అధిపతులదే ఈ బాధ్యత: కేంద్రం
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జూనియర్ డాక్టర్‌పై కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన హత్యాచారానికి నిరసనగా.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆందోళనలు చేపట్టారు. ధర్నాలతో పాటు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ.. 24 గంటలపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు మినహా.. ఓపీ వైద్యసేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. ఈ మేరకు డాక్టర్ల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్టు ఐఎంఏ తెలంగాణ విభాగం ప్రకటించింది.
రాష్ట్రప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే.. తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కానున్నారు. పంజగుట్టలోని నిమ్స్‌లో కూడా ఓపీ సేవలతోపాటు కొన్ని రకాల సర్జరీలను నిలిపివేస్తున్నట్టు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. యశోద, రెయిన్‌బో, కిమ్స్-సన్‌షైన్ తదితర ఆస్పత్రులు కూడా ఈ మేరకు ప్రకటన చేశాయి. కాగా.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకూ ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధి డాక్టర్ నరహరి పిలుపునిచ్చారు.
జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా.. అవసరమైతే ఒక గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. ఇక.. వైద్యులు, నర్సుల ఆందోళనకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతకు చర్యలు చేపట్టాలని.. వారి మీద దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఓపీ సేవల బంద్ నేపథ్యంలో.. వైద్య సేవలకు అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా డాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు.