Hyderabad: 5 డీఏల్లో ఒక్కటీ ఇవ్వలేదు
ABN , Publish Date - Oct 19 , 2024 | 03:33 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
సీపీఎస్ రద్దుపై చర్యలు తీసుకోలేదు
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు
ఇచ్చిన హామీలనూ నెరవేర్చలేదు
అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా
మా సమస్యలను పట్టించుకోవడం లేదు
21లోపు తేల్చకపోతే 22న కార్యాచరణ
ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పది నెలల నుంచి ప్రభుత్వ సలహాదారులు, సీఎంవో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నా.. తమ డిమాండ్లపై ఎలాంటి స్పందన లేదని తెలిపింది. కనీసం ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా లేదా? అని ప్రశ్నించింది. ఈ మేరకు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ శుక్రవారం ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ డిమాండ్లతో కూడిన లేఖలను జేఏసీ చైర్మన్ మారెం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అందజేశారు.
ఈ నెల 21 లోపు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే 22న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వారు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నా ఒక్కటి కూడా ఇవ్వలేదని, సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి.. పాత విధానం పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో ఉద్యోగుల జేఏసీ ఆక్షేపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ఉద్యోగుల తొమ్మిది డిమాండ్లతోపాటు ఇతర 41 డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి వద్దకు పలుమార్లు వెళ్లి.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరినా స్పందన అంతంత మాత్రమే ఉందన్నారు.
ఉద్యోగుల నుంచి సంఘాలపై ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదని పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉద్యోగుల మద్దతు ఉందని, కష్టకాలంలో ఉన్న ప్రభుత్వానికి చేదోడుగా ఉండేందుకు ఇటీవల వరదలపై ఉద్యోగులు స్పందించి రూ.130 కోట్ల విరాళం ప్రకటించారని జేఏసీ గుర్తు చేసింది.