Penalties: డిస్కమ్‌లను దారిలో పెట్టేందుకే జరిమానాలు
ABN , Publish Date - Oct 06 , 2024 | 04:01 AM
డిస్కమ్‌లకు క్రమశిక్షణ లేకుండాపోయిందని, సకాలంలో అవి వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్)/ పిటిషన్లు దాఖలు చేయడంలేదని, అందుకే వాటిని దారిలో పెట్టేందుకు జరిమానాల విధానం అమల్లోకి తెచ్చామని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) చైర్మన్ టి.శ్రీరంగారావు అన్నారు.
వాటికి క్రమశిక్షణ లేకుండాపోయింది..
సకాలంలో ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేయడంలేదు
రాష్ట్ర ఈఆర్‌సీ చైర్మన్ టి.శ్రీరంగారావు
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్‌లకు క్రమశిక్షణ లేకుండాపోయిందని, సకాలంలో అవి వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్)/ పిటిషన్లు దాఖలు చేయడంలేదని, అందుకే వాటిని దారిలో పెట్టేందుకు జరిమానాల విధానం అమల్లోకి తెచ్చామని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) చైర్మన్ టి.శ్రీరంగారావు అన్నారు. శనివారం ఈఆర్‌సీ అడ్వయిజరీ కమిటీ సమావేశం ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక, సామాజికాభివృద్ధిని నిలకడగా ఉంచడంలో ఇంధన రంగం పాత్ర కీలకమన్నారు. కేవలం టారి్‌ఫలను నిర్ణయించడమే ఈఆర్‌సీ బాధ్యతకాదని, వినియోగదారులందరికీ విద్యుత్ సరసమైన ధరలో అందించడమేకాకుండా నాణ్యతతో కూడిన సరఫరా ఈఆర్‌సీ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. డిస్కమ్‌ల పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగాలేదన్నారు.
ఏటా నవంబరు 30నఏఆర్‌ఆర్ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉండగా... ఆ బాధ్యతను సంస్థలు నిర్వర్తించడంలేదని ఆక్షేపించారు. సకాలంలో పిటిషన్లు వేసేలా డిస్కమ్‌లకు పెనాల్టీల విధానం అమలు చేస్తున్నామన్నారు. డిస్కమ్‌ల పనితీరును మెరుగుపరచడంతోపాటు వాటిలో లోపాలను సరిచేస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన అన్ని పిటిషన్లపై సూచనలు/సలహాలు/అభిప్రాయాలు తెలియజేసేందుకు ఈనెల 11వరకు గడువిచ్చామన్నారు. ఏఆర్‌ఆర్/పిటిషన్లపై ఈనెల 21 నుంచి 25 దాకా బహిరంగ విచారణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఆర్‌ఆర్‌ను ఆలస్యంగా దాఖలు చేసినందున కొత్త టారిఫ్ అమలుకు ఐదు నెలలే గడువు ఉండటంతో దీన్ని విచారణకు స్వీకరించకుండా వాయిదా వేయాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కోరారు. ఏఆర్‌ఆర్‌పై అభ్యంతరాలు వ్యక్తపరిచేందుకు గడువుపెంచాలని మరికొందరు ఈ సందర్భంగా కోరారు.