Khammam: మృత్యువులోనూ వీడని బంధం
ABN , Publish Date - Sep 12 , 2024 | 04:51 AM
డెబ్బై ఏళ్ల వైవాహిక బంధం ఒకరిది.. 56 ఏళ్ల రక్తసంబంధం మరొకరిది.. మృత్యువు కూడా వాళ్ల బంధాన్ని విడదీయలేకపోయింది.
భార్య మరణ వార్త విని ఆగిన భర్త గుండె
తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అక్క మృతి
లింగాలఘణపురం, బోనకల్, సెప్టెంబరు 11 : డెబ్బై ఏళ్ల వైవాహిక బంధం ఒకరిది.. 56 ఏళ్ల రక్తసంబంధం మరొకరిది.. మృత్యువు కూడా వాళ్ల బంధాన్ని విడదీయలేకపోయింది. భార్య మరణవార్త విని భర్త గుండె ఆగిపోగా... మరో ఘటనలో తమ్ముడి మృతిని తట్టుకోలేక అతని అక్క గుండె పగిలిపోయింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాం తాల్లో బుధవారం ఈ విషాదకర ఘటనలు జరిగాయి. ఖమ్మం జిల్లా బోనకల్‌కు చెందిన నందమూరి అనమయ్య(90), సుందరమ్మ(84) కు 70 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయంపై ఆధారపడిన ఈ దంపతులు తమ కుమారుడు, ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఈ దంపతు లు కొద్ది రోజులుగా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్నారు.
ఈ క్రమంలో సుందరమ్మ బుధవారం ఉదయం మరణించారు. కొన్ని గంటల తర్వాత తల్లి మరణవార్తను కుమార్తె తన తండ్రి అనమయ్యకు చెప్పింది. ఈ వార్త వినగానే అనమయ్య గుండె ఆగి మరణించారు. గంటల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మరో ఘటనలో... జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన గాడిపెల్లి శంకర్(56) నాలుగేళ్ల క్రితం పక్షవాతానికి గురవ్వగా ఆరోగ్యం క్రమంగా క్షీణించి బుధవారం మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న శంకర్ అక్క, అదేగ్రామానికి చెందిన కుడికాల రుక్కుంబాయి (58) సోదరుడి ఇంటికి చేరుకుంది. శంకర్ మృతదేహంపై బోరున విలపిస్తూ అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మారమధ్యలోనే ప్రాణం విడిచింది. ఒకరి తర్వాత మరొకరుగా అక్కాతమ్ముళ్లు మరణించడంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. శంకర్‌కు భార్య లలిత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక రుక్కుంబాయి భర్త పదేళ్ల క్రితం మృతిచెందగా ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.