Share News

Nalgonda: ఇచ్చింది తీసుకో.. లేదంటే పో!!

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:51 AM

బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం రకాలకు విపరీతమైన ధర పలుకుతున్నా వాటిని పండించిన రైతులు మాత్రం లబ్ధి పొందడం లేదు. మిల్లర్లు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు.

Nalgonda: ఇచ్చింది తీసుకో.. లేదంటే పో!!

  • సన్న ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడి

  • ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ఇష్టారాజ్యం

  • రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వని వైనం

  • క్వింటాల్‌కు రూ.2,100-2,300 మాత్రమే చెల్లింపు

  • భారీగా నష్టపోతున్న అన్నదాతలు.. పట్టించుకోని అధికారులు

నల్లగొండ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం రకాలకు విపరీతమైన ధర పలుకుతున్నా వాటిని పండించిన రైతులు మాత్రం లబ్ధి పొందడం లేదు. మిల్లర్లు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు రూ.500 బోనస్‌ కూడా ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటిదాకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. ‘మేము చెప్పిందే ధర’ అనే పరిస్థితిని మిల్లర్లు సృష్టించారు. ఇచ్చింది తీసుకో.. లేదంటే వెళ్లిపో అంటూ రైతులను బెదిరించి తమకు నచ్చిన ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సన్నధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,320 కాగా బోనస్‌ రూ.500 కలిపి ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే, కొనుగోలు కేంద్రాలు ఇప్పటిదాకా ప్రారంభించలేదు.


దీంతో రైతులు తమకు సమీపంలోని రైస్‌ మిల్లు పాయింట్ల వద్ద ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఇలా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, చిట్యాల ప్రాంతాల్లోని మిల్‌పాయింట్ల వద్ద ధాన్యం విక్రయిస్తున్న రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదు. ఇక్కడ కనీసం రూ.2,800 ఇవ్వాల్సిన ధరను ధాన్యం పచ్చిగా ఉందంటూ రూ.2,100 నుంచి రూ.2,300కే పరిమితం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంటకు చెందిన ఓ రైతు 40 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని (కావేరి చింట్లు) గురువారం మిర్యాలగూడలోని ఓ ప్రముఖ రైస్‌మిల్‌ పాయింట్‌ వద్దకు తీసుకువస్తే రూ.2,200 ధర నిర్ణయించారు. తెచ్చిన ధాన్యాన్ని వెనక్కి తీసుకెళ్లలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో అదే ధరకు రైతు విక్రయించాడు. నిజానికి, నన్న ధాన్యం సీఎంఆర్‌ శాతాల (పచ్చి బియ్యం 59 కిలోలు, బాయిల్డ్‌ అయితే 60 కిలోలు)ను తగ్గించాలని మిల్లర్లు ఇటీవల మంత్రులను కోరారు.


దీనిపై మంత్రి వర్గ ఉప సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా వరి కోతలు మొదలవ్వడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, చండూరు డివిజన్ల నుంచి మిర్యాలగూడ ప్రాంతంలోని మిల్లుల వద్దకు రైతులు ధాన్యం తీసుకొస్తున్నారు. దీంతో మిల్లు పాయింట్ల వద్ద మిల్లర్లు నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో విదేశాలకు కూడా సన్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతించడం, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడాన్ని మిల్లర్లు అవకాశంగా మార్చుకున్నారు. తమకు నచ్చిన ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారు. పైగా, సీఎంఆర్‌పై ప్రభుత్వం దిగివచ్చే దాకా మార్కెట్లో సన్న ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,400కి మించి కొనుగోలు చేయవద్దని మిల్లర్లు అంతర్గతంగా అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

Updated Date - Oct 18 , 2024 | 03:51 AM