Hyderabad: సెప్టెంబరు 17న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:01 AM
నిజాం చెర నుంచి తెలంగాణ విముక్తి పొంది, అఖండ భారత్‌లో విలీనమైన సెప్టెంబరు 17వ తేదీని ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా నామకరణం చేసిన రేవంత్ సర్కారు
బీఆర్‌ఎస్ హయాంలో ‘జాతీయ సమైక్యతా దినం’..
విమోచన దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం
హైదరాబాద్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): నిజాం చెర నుంచి తెలంగాణ విముక్తి పొంది, అఖండ భారత్‌లో విలీనమైన సెప్టెంబరు 17వ తేదీని ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా నామకరణం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ ఉత్సవాన్ని రాజధాని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపింది. మిగిలిన 32 జిల్లాల్లో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లకు డిజిగ్నేట్ చేసింది.
తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచీ సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌ను వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఆయా పార్టీల కార్యాలయాల్లో వేర్వేరు పేర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవంగా నిర్వహిస్తుండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు రాలేదు. కానీ, గత ఎన్నికలకు ముందు మాత్రం సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ దీనిని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించి నిర్వహించింది. గత ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సెప్టెంబరు 17ను ఏ పేరుతో నిర్వహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తెరదించుతూ.. తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహించనున్నట్లు సర్కారు స్పష్టత ఇచ్చింది.