Share News

Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:45 AM

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. రానున్న సంక్రాంతికి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి రెండో వారంలో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.

Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

  • జనవరి 14న నోటిఫికేషన్‌.. ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికలు

  • 3 దశల్లో నిర్వహణ.. తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీలకు

  • ఇద్దరు పిల్లలకు మించి సంతానం నిబంధన ఎత్తివేత

  • సమగ్ర కులగణనపై డిసెంబరు 10 వరకు నివేదిక

  • అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం

  • కొన్ని మండలాల్లో పెరగనున్న ఎంపీటీసీ స్థానాలు

  • రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు.. ఈలోపు రైతుభరోసా

    12,867 పంచాయతీలు

    538 జడ్పీటీసీలు

    5,817 ఎంపీటీసీలు

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. రానున్న సంక్రాంతికి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి రెండో వారంలో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్‌ ఎన్నికలను ఒకేరోజు జరిపితే ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్పంచ్‌ ఎన్నికలు ముగిశాక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు ‘ఇద్దరు పిల్లలకు మించి సంతానం’ నిబంధనను ఎత్తివేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపైనా వేగంపెంచినట్లు సమాచారం. వీటికి సంబంధించిన నిబంధనలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బిల్లుపెట్టి.. ఆమోదింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జనవరి 31న సర్పంచుల పదవీకాలం పూర్తయింది. అయితే గత 10నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఎన్నికలు జరపాలని పలు వర్గాల నుంచి డిమాండ్‌ వస్తున్నప్పటికీ.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసి, స్థానిక ఎన్నికలు జరిపేవిధంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.


స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్‌ సమగ్ర కులగణన పూర్తిచేసి.. డిసెంబరు 10నాటికి నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదికను పరిశీలించిన అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉంది. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగా పెంచే అవకాశాలను పరిశీలించనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించకూడదన్న నిబంధనను పాటించాల్సి ఉన్నందున.. ప్రత్యామ్నాయ మార్గంపై కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాంటి పరిస్థితిఉంటే.. పార్టీపరంగా బీసీలకు అధిక స్థానాలు కేటాయించి.. తామే అమలు చేశామని అధికార పార్టీ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని ఎస్‌ఈసీ గతంలో తెలిపింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు మొదలయ్యేలోపు యాసంగి సీజన్‌ కోసం పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా పథకాన్ని పూర్తిచేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.


  • సర్పంచ్‌ ఎన్నికల తర్వాతే..

రాష్ట్రవ్యాప్తంగా 12,867 గ్రామపంచాయతీలు, 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జూలై 2న జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసింది. సర్పంచ్‌ ఎన్నికల్లో పార్టీల గుర్తులుండవు! జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మాత్రం పార్టీల గుర్తులతో ఎన్నికల్లో పోటీపడాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీల పరిధిలో సర్పంచ్‌ ఎన్నికల తర్వాతే.. ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని కొత్త మండలాల్లో ముగ్గురు ఎంపీటీసీలతోనే ఎంపీపీ పదవి కల్పించాల్సి వస్తోంది. నిబంధన ప్రకారం కనీసం ఐదుగురు ఎంపీటీసీలతో ఎంపీపీలు ఉండేలా ఆయా మండలాల్లో ఎంపీటీసీల సంఖ్య పెంచాల్సి ఉంది. దీనిపై అసెంబ్లీలో చర్చించి ఒక చట్టం తెచ్చేవిధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


  • ఎన్నికల సిబ్బంది నియామకంపై..

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారుల నియామకానికి రాష్ట్రఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా రిటర్నింగ్‌ అధికారులు, ప్రిసైడింగ్‌, పోలింగ్‌ అధికారులు, సిబ్బంది నియామకాలను చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పంచాయతీకి ఒకరు చొప్పున స్టేజ్‌-1 అధికారి ఉంటారు. వీరు నామినేషన్ల స్వీకరణ నుంచి గుర్తులు కేటాయిచేఏ వరకు పనులు చూసుకుంటారు. స్టేజ్‌-2 అధికారులు పోలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. వీరితోపాటు పోలింగ్‌ సిబ్బంది కూడా ఉంటారు. పంచాయతీల వారీగా వీరిని గుర్తించేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 200 మంది వరకు ఓటర్లు ఉంటే ప్రిసైడింగ్‌ అధికారితోపాటు పోలింగ్‌ అధికారి ఉంటారు. 201 నుంచి 400 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్‌ అధికారితోపాటు ఇద్దరు పోలింగ్‌ అధికారులు ఉంటారు. అదేవిధంగా 401 నుంచి 650 మంది ఓటర్లు ఉంటే ప్రిసైడింగ్‌ అధికారితోపాటు ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమిస్తారు. 650 మందికంటే ఎక్కువ ఓటర్లు ఉంటే అదనపు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు రాగానే.. వీరికి ఎన్నికల విధులపై శిక్షణ ఇవ్వనున్నారు.


  • కొనసాగుతున్న పోలింగ్‌ స్టేషన్ల ఎంపిక

గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా.. ఓటరుజాబితా ఇప్పటికే సిద్ధం చేసినప్పటికీ.. కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలద్వారా ప్రస్తుతం సప్లిమెంటరీ ఓటరు జాబితా రూపకల్పన కొనసాగుతోంది. ఎన్నికలకోసం సదరు గ్రామంలోని ప్రతివార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండేలా చూడాలని ఎస్‌ఈసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను వివిధ వార్డుల్లో విభజించేటపుడు వారందరికీ ఒకేవార్డులో ఒకే పోలింగ్‌ స్టేషన్‌లో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించే విధంగా అధికారులు దృష్టిపెట్టారు. 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఉండేలా.. 650కి మించితే సదరు వార్డులో రెండు పోలింగు కేంద్రాలు,, ఓటర్ల సంఖ్య 1300 దాటితే.. మూడో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసే విధంగా గ్రామాలవారీగా అధికారులు కసరత్తు చేపట్టారు.

Updated Date - Nov 29 , 2024 | 04:45 AM