Share News

Rice Millers: వేలం ధాన్యాన్ని అమ్మేశారా?

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:18 AM

వేలంలో విక్రయించిన ధాన్యం, దానికి సంబంధించిన నగదు వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రైస్‌ మిల్లర్లు, వేలం సంస్థల ముక్కుపిండి మరీ.. బకాయిలను వసూలు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. అయితే.. రైస్‌ మిల్లుల్లో వరిధాన్యం నిల్వలున్నాయా?

Rice Millers: వేలం ధాన్యాన్ని అమ్మేశారా?

  • రైస్‌మిల్లుల్లో అధికారుల తనిఖీలు

  • ఈనెల 30న నివేదికకు పౌరసరఫరాల సంస్థ ఎండీ ఆదేశాలు

  • 9 జిల్లాల్లోని 395 మిల్లుల్లో తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు

  • డిసెంబరు 31 లోపు ధాన్యం ఎత్తకపోతే ‘ఈఎండీ’ జప్తు

  • తుది గడువు దాటితే 125ు చెల్లించాలని మిల్లర్లకు షరతు

  • యాసంగి బకాయిల వసూళ్లకు మిల్లర్లు, ఏజెన్సీలపై ఉక్కుపాదం

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వేలంలో విక్రయించిన ధాన్యం, దానికి సంబంధించిన నగదు వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రైస్‌ మిల్లర్లు, వేలం సంస్థల ముక్కుపిండి మరీ.. బకాయిలను వసూలు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. అయితే.. రైస్‌ మిల్లుల్లో వరిధాన్యం నిల్వలున్నాయా? లేకపోతే.. వాటిని అమ్మేసుకున్నారా? అనే దానిపై సంయుక్త తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 9 ఉమ్మడి జిల్లాల్లోని 395 రైస్‌మిల్లుల్లో.. ఆయా జిల్లాల పౌరసరఫరాల అధికారులు, డీఎంలు, రైస్‌మిల్లర్లు, వేలం సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలకు సిద్ధమయ్యాయి. 2022-23 యాసంగి పంటకాలానికి సంబంధించిన 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో వేలం వేసిన విషయం తెలిసిందే..! కేంద్రీయ భండార్‌, న్యాకాఫ్‌, మంచుకొండ ఆగ్రోటెక్‌, హిందుస్థాన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్తలు ఈ టెండర్లను దక్కించుకున్నాయి. సగటున క్వింటాకు రూ.2వేల చొప్పున ధర ఖరారైంది.


వేలం సంస్థలు తొలుత రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు డబ్బులు చెల్లించి, విడుదల ఉత్తర్వులు తీసుకెళ్లి, మిల్లు యజమానులకు చూపించి.. ధాన్యం తీసుకెళ్లాలనే నిబంధన పెట్టారు. 90 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని గడువు విధించారు. నిర్ణీత గడువులో వేలం సంస్థలు ధాన్యం లోడెత్తలేదు. కొన్ని రైస్‌మిల్లుల్లో ధాన్యం ఉండటం, మరికొన్ని మిల్లుల్లో లేకపోవటంతో వేలం సంస్థలకు, రైస్‌మిల్లర్లకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. వేలం ధర ప్రకారం క్వింటాలుకు రూ.2వేలు చెల్లిస్తామని రైస్‌మిల్లర్లు, రూ.200 కమీషన్‌ కలిపి రూ.2,200 చొప్పున చెల్లించాలని వేలం సంస్థలు పట్టుబట్టడంతో సమస్య కొలిక్కిరావటంలేదు. ఇప్పటి వరకు 12 లక్షల టన్నుల ధాన్యం వసూలు కాగా.. ఇంకా 23 లక్షల టన్నులు రైస్‌మిల్లర్ల వద్దే ఉన్నాయి. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరకపోవటంతో.. వేలం సంస్థలు ఈనెల 8, 18 తేదీల్లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదులు చేశాయి. వేలం పాటలో విక్రయించిన ధాన్యం రైస్‌మిల్లుల్లో అందుబాటులో లేదని, అందుకే మిల్లర్లు ధాన్యం అప్పగించటంలేదనేది ఆ ఫిర్యాదుల్లోని సారాంశం.


దీంతో.. పౌరసరఫరాల సంస్థ ఎండీ డీఎస్‌ చౌహాన్‌ రైస్‌మిల్లుల్లో సంయుక్త సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు(డీసీఎ్‌సవోలు), జిల్లా మేనేజర్లు(డీఎంలు), రైస్‌మిల్లర్లు, వేలం సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, క్షేత్రస్థాయిలో తనిఖీలకు పంపించారు. అసలు రైస్‌మిల్లుల్లో ధాన్యం ఉందా? లేదా? అనే విషయాన్ని ఈ తనిఖీల్లో నిర్ధారించాలని ఎండీ ఆదేశించారు. దీంతో.. శనివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్‌మిల్లుల్లో భౌతిక తనిఖీలు ప్రారంభమయ్యాయి. వేలం సంస్థలు దక్కించుకున్న ధాన్యం లాట్ల వారీగా జాబితాలను తయారుచేసి, సంయుక్త తనిఖీలకు వెళ్లే.. బృందాలకు అందజేశాయి. రైస్‌మిల్లు పేరు, ఆ రైస్‌మిల్లుకు ఇచ్చిన ధాన్యం పరిమాణం ఎంత? సీఎంఆర్‌ ఎంత తిరిగిచ్చారు? ఉప్పుడు బియ్యం ఎంతిచ్చారు? ముడి బియ్యం ఎంతిచ్చారు? తిరిగిచ్చిన బియ్యానికి సరిపోయే ధాన్యం ఎంత? వేలం సంస్థలు ఎంత ధాన్యాన్ని తీసుకెళ్లాయి? ఇంకా ఎంత ధాన్యం మిగిలి ఉంది? అనే ప్రొఫార్మాలో సంయుక్త తనిఖీ బృందాలు నివేదికలను సిద్ధం చేస్తాయి. ఈ నెల 30న రాష్ట్రస్థాయి నివేదికను సమర్పించాలని డీఎస్‌ చౌహాన్‌ ఆదేశించారు.


  • తుది గడువు దాటితే ఈఎండీ జప్తు

వేలం నిబంధనల ప్రకారం 90 రోజుల్లోనే ధాన్యం తీసుకెళ్లాలి. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ గడువును పొడిగించారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో డిసెంబరు 31 వరకు తుది గడువు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటికి ఽధాన్యాన్ని పూర్తిగా తీసుకెళ్లినా, తీసుకెళ్లకపోయినా వేలం సంస్థలతో ఒప్పందం రద్దుచేసుకోవాలని నిర్ణయించారు. నిర్ణీత గడువులోపల ప్రక్రియ పూర్తికాకపోతే.. ఈఎండీ జప్తు చేయాలనే నిర్ణయానికి మంత్రివర్గం రావటం గమనార్హం..! ఇటీవల జారీచేసిన పొడిగింపు ఉత్తర్వుల్లో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా చేర్చారు. టెండరు ఒప్పంద సమయంలో సంబంధిత వేలం సంస్థలు రూ.336 కోట్ల మేర ఈఎండీ చెల్లించాయి. మొత్తం 12 లాట్లు కాగా.. ఒక్కో లాట్‌కు రూ.28 కోట్ల చొప్పున ఈఎండీని అందజేశాయి. సకాలంలో ధాన్యం తీసుకెళ్లకుండా.. టెండరు నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను ఈఎండీని జప్తుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే 336 కోట్లలో చాలా వరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఖాతాలోకి వెళ్లిపోతాయి.


  • రైస్‌మిల్లర్లకు 25% జరిమానా

తుది గడువులోగా ధాన్యం అప్పగించని రైస్‌మిల్లర్లకు 25ు జరిమానా విధించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. డిసెంబరు 31లోగా.. ధాన్యాన్ని వేలం సంస్థలకు అప్పగిస్తే.. ఎలాంటి జరిమానా ఉండదు. ఒకవేళ గడువు దాటి, టెండర్లు రద్దయితే మాత్రం.. మిల్లర్లు 25ు జరిమానాతో కలిపి.. 125ు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. వెయ్యి టన్నుల ధాన్యం బకాయి ఉన్న రైస్‌మిల్లరు 250 టన్నులు అదనంగా కలిపి 1,250 టన్నుల ధాన్యాన్ని అప్పగించాలి. టెండర్‌ ధర ప్రకారం చూసుకుంటే.. క్వింటాకు రూ.2వేలు ఖరారవ్వగా.. మిల్లర్లు దానికి రూ.500 జరిమానాను చేర్చి, రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Nov 26 , 2024 | 03:18 AM