Share News

Suryapet: జనవరి 10 వరకు ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:36 AM

వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Suryapet: జనవరి 10 వరకు ధాన్యం కొనుగోళ్లు

  • 21.73 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ.. 2,760 కోట్ల చెల్లింపులు : ఉత్తమ్‌

  • సూర్యాపేట జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్‌, హుజూర్‌నగర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. కాళేశ్వరం పథకం నుంచి చుక్క నీరు రాకపోయినా.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని తెలిపారు. 66 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 153 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. దేశంలోనే ఇది అరుదైన రికార్డని చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశా రు. అనంతరం పలు జిల్లాల అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ధాన్యం తూకం వేసిన మూడ్రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 3.50 లక్షల మంది రైతుల నుంచి రూ.5,040 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో 16.06 లక్షల టన్నులు దొడ్డు ధాన్యమని, 5.67 లక్షల టన్నులు సన్న ధాన్యమని వెల్లడించారు. సన్నాల రైతులకు క్వింటాలుకు రూ.500 ప్రోత్సాహం కింద రూ.283.25 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో మొత్తం 7,990 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. నిరుడు ఈ సమయానికి రైతులకు రూ.2,414 కోట్లు చెల్లిస్తే.. ఈసారి రూ.2,760 కోట్లు చెల్లించామన్నారు.


  • ఇబ్బంది పెడితే సహించం!

హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉత్తమ్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. దీంతో మంత్రి.. కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని, ఎన్ని టోకెన్లు కావాలన్నా వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కొన్న ధాన్యాన్ని తక్షణం లారీలు, ట్రాక్టర్లలో మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాగర్‌ ఆయకట్టు పరిధిలో పంటలు ఎలా పండాయని మంత్రి ఆరా తీయగా.. పంట దిగుబడులు అధికంగా వచ్చాయని రైతులు తెలిపారు.

Updated Date - Nov 25 , 2024 | 02:36 AM