Share News

Satyasai Trust: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాగి జావ

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:07 AM

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించే అంశంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ ఇకపై రాగి జావ ఇవ్వనుంది.

Satyasai Trust: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాగి జావ

  • శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో కార్యక్రమం

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించే అంశంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ ఇకపై రాగి జావ ఇవ్వనుంది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో వారానికి మూడు సార్లు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను విద్యా శాఖ గురువారం జారీ చేసింది. రాగి జావ తయారీకి కావాల్సిన రాగి మాల్ట్‌, బెల్లం పొడి.. సత్యసాయి ట్రస్ట్‌, ప్రభుత్వం నుంచి పాఠశాలలకు చేరనున్నాయి.


ఒక్కో విద్యార్థికి ఇచ్చే జావలో 10 గ్రాముల రాగి పొడి, అదే స్థాయిలో బెల్లం పొడి వాడనున్నారు. అల్పాహార సమయం లేదా మధ్యాహ్న భోజనం పూర్తయిన తర్వాత విద్యార్థులకు రాగి జావ ఇవ్వనున్నారు.విద్యార్థులకు కోడిగుడ్డు ఇవ్వని రోజుల్లో రాగిజావ ఇస్తారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దసరాను పురస్కరించుకుని ఆదివారం(6వ తేదీ) నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్టు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యామండలి గురువారం ప్రకటన చేసింది. 14వ తేదీ నుంచి అన్ని కళాశాలల్లో తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది.

Updated Date - Oct 04 , 2024 | 04:07 AM