Share News

Dharani portal: ధరణి మొరాయింపు..

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:35 AM

ధరణి పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థ టెర్రాసిస్‌ నుంచి ‘జాతీయ సమాచార కేంద్రాని (ఎన్‌ఐసీ)’కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో ఉత్తర్వులిచ్చింది.

Dharani portal: ధరణి మొరాయింపు..

  • డేటా బదిలీలో సాంకేతిక సమస్యలు నిర్వహణ బాధ్యతలు 1 నుంచి ఎన్‌ఐసీకి

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థ టెర్రాసిస్‌ నుంచి ‘జాతీయ సమాచార కేంద్రాని (ఎన్‌ఐసీ)’కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో ఉత్తర్వులిచ్చింది. ధరణి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 1.56 కోట్ల ఎకరాలకు సంబంధించిన భూదస్త్రాలను గత పాలకులు విదేశీ సంస్థ చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ధరణి నిర్వహణను ఎన్‌ఐసీకి అప్పగించడం వల్ల రైతులకు చెందిన 71 లక్షల ఖాతాల భూములు సురక్షితంగా ఉంటాయని ప్రకటించారు. ఈ నెల 1 నుంచి భూ రికార్డుల నిర్వహణను ఎన్‌ఐసీ చేపట్టాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ధరణి సమాచారం ఎన్‌ఐసీకి బదిలీ కావడం లేదు.


సాఫ్ట్‌వేర్‌లో లోపాల వల్ల భూదస్త్రాల నిర్వహణ ఎన్‌ఐసీ చేపట్టలేకపోయింది. రికార్డుల నిర్వహణ, భూ లావాదేవీలపై రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి వేలిముద్రలు వేయాలని ప్రయత్నించినా ఎన్‌ఐసీ సర్వీస్‌ ప్రొవైడర్‌ తీసుకోవడం లేదు. దీంతో చాలా దస్త్రాలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. అధికారుల వేలిముద్రలు ఎందుకు పని చేయడం లేదనే దానిపై సాంకేతిక నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. త్వరలో కొత్త ఆర్వోఆర్‌ చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ధరణి పెండింగ్‌ సమస్యల పరిష్కారంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. కానీ, డేటా బదిలీ కాకపోవడం, సమస్యలను అప్‌డేట్‌ చేసేందుకు వీల్లేకపోవడంతో గందరగోళం నెలకొంది. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 06 , 2024 | 03:35 AM