DSC Exams: మరో డీఎస్సీ!
ABN , Publish Date - Jul 15 , 2024 | 03:35 AM
ప్రస్తుత పరిస్థితుల్లో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇదే చివరి డీఎస్సీ కాదని.. మరిన్ని ఉంటాయని చెప్పారు. త్వరలో 5 వేల నుంచి 6 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.
5- 6 వేల ఉద్యోగాలతో త్వరలో నోటిఫికేషన్
ప్రస్తుత డీఎస్సీని వాయిదా వేయం.. అలా చేస్తే అభ్యర్థులకే నష్టం
విద్యా వ్యవస్థ బలోపేతం మా లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్, జూలై 14(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇదే చివరి డీఎస్సీ కాదని.. మరిన్ని ఉంటాయని చెప్పారు. త్వరలో 5 వేల నుంచి 6 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని.. విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి బోధన అందాలనేదే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తొందరగా ఉద్యోగాలివ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. గాంధీభవన్‌లో ఆదివారం భట్టి మీడియాతో మాట్లాడారు. కొంతమంది నియామక పరీక్షలు వాయిదా వేయాలని ధర్నా చేస్తున్నారని.. అలాచేస్తే నష్టపోయేది అభ్యర్థులేనని అన్నారు.
ఈ నెల 11 నుంచే డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని.. కొన్ని నెలలుగా అభ్యర్థులు సిద్ధం అవుతున్నారని.. 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. పదేళ్ల పాటు గ్రూప్-1 నిర్వహించనే లేదని విమర్శించారు. గ్రూప్-2ను మూడుసార్లు వాయిదా వేసిన సంగతిని గుర్తుచేశారు. పరీక్షలను అన్నిసార్లు వాయిదా వేయడం సరికాదన్నారు. నిరుద్యోగులకు నష్టం కలగకూడదనేదే తమ ప్రయత్నమని చెప్పారు. తెలంగాణ తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకుని.. ఆ దిశగా దృష్టిసారించామన్నారు. పదేళ్లుగా డీఎస్సీ లేకపోవడంతో నిరుద్యోగులు, సరైన బోధన అందక పేద విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించామని 11వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 34వేల మందిని బదిలీ చేశామని పేర్కొన్నారు. హాస్టల్ వెల్ఫేర్‌కు సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు జరిపామని.. మొత్తం 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో 13,321 పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను గాలికి వదిలేశారని భట్టి మండిపడ్డారు. పదేళ్లు డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలూ ప్రకటించామని గుర్తుచేశారు. గ్రూప్-3కి సైతం తాము షెడ్యూల్ ఇచ్చామన్నారు.