BRS Protest: బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:20 PM
Telangana High Court: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
హైదరాబాద్, నవంబర్ 21: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వెయ్యి మందితో ధర్నా చేపట్టొచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ మాత్రం 50 వేల మందితో మహా ధర్నా చేపడతామని మొదట ప్రకటించింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో.. తక్కువ మందితోనే ధర్నా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.
మహబూబాబాద్‌లో గిరిజన రైతుల మహాధర్నాకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పోలీసుల అనుమతి కోరింది. కానీ, పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు. తొలుత పోలీసులు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో.. బీఆర్ఎస్ ముఖ్యనేతలంతా జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. మహా ధర్నాకు అనుతి ఇచ్చే వరకు కదిలేది లేదని ప్రకటించారు. చివరకు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. వాదనలు విన్న ధర్మాసనం.. బీఆర్ఎస్ మహా ధర్నాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆయన.. ఇదేం పాలన అంటూ సీఎం రేవంత్‌పై ఘాటైన విరమ్శలు చేశారు.
కేటీఆర్ పోస్టు సారాంశం..
‘ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి? అక్కడ గొడవలు ఏం జరగలేదు ?-మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు? అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ? శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ? ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది ? ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన.. మొత్తంగా రాక్షస పాలన.. ఖబర్దార్ రేవంత్.. ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది. జై తెలంగాణ.’ అంటూ పోస్ట్ చేశారు కేటీఆర్.
ఖమ్మం మార్కెట్‌లో ధర్నా..
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్‌లో ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నారు. గురువారం రాత్రికే ఖమ్మం చేరుకోనున్నారు మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్. శుక్రవారం ఉదయం 7 గంటలకు పత్తి కొనుగోలు చేయాలంటూ ధర్నా చేపట్టనున్నారు.
Also Read:
అవినీతి ఆరోపణలు.. స్పందించిన అదానీ గ్రూప్స్..
For More Telangana News and Telugu News..