Canes Technology: పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:29 AM
సాఫ్ట్ట్‌వేర్ కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉందని, అందుకే అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
2 నెలల్లో స్కిల్ వర్సిటీ అందుబాటులోకి: శ్రీధర్‌బాబు
కేన్స్ ఎలకా్ట్రనిక్స్ తయారీ కేంద్రం ప్రారంభం
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23: సాఫ్ట్ట్‌వేర్ కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉందని, అందుకే అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎలకా్ట్రనిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ అయిన కేన్స్ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎలకా్ట్రనిక్స్ తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 7 రాష్ట్రాల్లోని 10 పట్టణాల్లో కేన్స్ టెక్నాలజీ సంస్థ విస్తరించి ఉందని, ఇప్పుడు తెలంగాణలోనూ అడుగు పెట్టడం శుభపరిణామని అన్నారు. రూ.2,800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో రెండు వేల మంది ఉపాధి పొందనున్నారని తెలిపారు. కేన్స్ ఎలకా్ట్రనిక్స్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని గత పాలకులు తప్పుడు ప్రచారం ప్రచారం చేశారని, ఇప్పుడు వారేం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ ఎలకా్ట్రనిక్స్ కంపెనీ కూడా త్వరలోనే తన ఉత్పత్తులను ప్రారంభించనుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కేన్స్ టెక్నాలజీ ఎండీ రమేశ్ కున్హికన్నన్, చైర్‌పర్సన్ సవితా రమేశ్, సీఈవో జైరామ్ పి.సంపత్ పాల్గొన్నారు.