Share News

Uttam Kumar Reddy: నిర్లక్ష్యంతో నష్టం జరిగితే సీఈలదే బాధ్యత!

ABN , Publish Date - Sep 06 , 2024 | 03:26 AM

రాష్ట్రంలో భారీ వరదల కారణంగా తెగిన చెరువులు, కాలువలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Uttam Kumar Reddy: నిర్లక్ష్యంతో నష్టం జరిగితే సీఈలదే బాధ్యత!

  • ప్రతి ప్రాజెక్టు గేట్లు, కాలువలను తనిఖీ చేయాలి

  • చెరువులు, కాలువల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరపండి

  • స్వల్పకాలిక టెండర్లు పిలిచి, పనులు చేపట్టండి: మంత్రి ఉత్తమ్‌

  • ప్రాజెక్టుల నిర్వహణకు నిధులివ్వాలని అధికారుల విజ్ఞప్తి

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వరదల కారణంగా తెగిన చెరువులు, కాలువలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మరమ్మతులకు స్వల్పకాలిక టెండర్‌ విధానం అనుసరించి, శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేయాలని చెప్పారు. దెబ్బతిన్న చెరువులు, కాలువలతో పాటు జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలపై గురువారం జలసౌధలో క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.


యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఉత్తమ్‌ ఆదేశించారు. మానవ తప్పిదాలతో నష్టం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, సంబంధిత చీఫ్‌ ఇంజనీర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వరద నష్టంపై సమగ్ర నివేదికను అందించాలన్నారు. మరోవైపు వరదల సమయంలో అప్రమత్తంగా ఉన్న ఉద్యోగులు, అధికారులను అభినందించారు. ప్రతి ప్రాజెక్టు గేట్లతో పాటు కాలువల షట్టర్లను, రెగ్యులేటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిరంతర పర్యవేక్షణతోనే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్‌ ముంపునకు కారణాలపై నివేదిక అందించాలని చెప్పారు. సర్జ్‌పూల్‌, పంప్‌హౌ్‌సలో చేరిన నీటిని తొలగించడానికి అదనంగా మోటార్లు పెట్టాలని, అందుకు అవసరమైన కరెంట్‌ను అందించాలని డిస్కమ్‌ అధికారులను ఆదేశించారు.


  • 10 నెలలుగా బిల్లులు పెండింగ్‌: అధికారులు

ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) పనుల కోసం రూ.1100 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే రూ.350 కోట్లే మంజూరు చేశారని, పనులకు చెల్లింపులు చేయకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు మంత్రికి తెలిపారు. రూ.150 కోట్లకు పైగా బిల్లులు పది నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 1800 నీరడీ పోస్టులు మంజూరైనా.. నియామకాలు లేకపోవడంతో కాలువల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు. భారీ వరదలతో 544 చోట్ల చెరువులు/ కాలువలు/ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని నివేదించారు. వరదలతో దెబ్బతిన్న వనరులకు శాశ్వత మరమ్మతులు చేయడానికి రూ.900 కోట్లు కావాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక ఓఅండ్‌ఎం నిధులపై ఆందోళన అక్కర్లేదని, బిల్లులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటానని, మంత్రి హామీ ఇచ్చారు.


  • వానలు తగ్గగానే నీటిపారుదల శాఖలో పదోన్నతులు

వానలు తగ్గుముఖం పట్టగానే నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసి, బదిలీలు చేపడతామని మంత్రి ఉత్తమ్‌ ప్రకటించారు. ఆయన విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పదేళ్లుగా పదోన్నతులు లేక నీటిపారుదల శాఖ అస్తవ్యస్తంగా మారిందని, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌ అధ్యక్షతన కమిటీ వేశామని గుర్తుచేశారు. పదోన్నతులు కల్పించిన తర్వాత బదిలీలు చేపడతామన్నారు. బోర్డు నిర్వహణకు నిధులు ఇవ్వాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ అతుల్‌ జైన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి, నిధుల విడుదలపై నివేదించారు. స్పందించిన మంత్రి.. నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Updated Date - Sep 06 , 2024 | 03:26 AM