Tummala: ఉద్యోగులకిచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాం
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:22 AM
ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని, ప్రతీ ఉద్యోగి సంయమనం పాటిస్తే వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
జనవరి కల్లా అన్ని సమస్యలకు పరిష్కారం
ఖమ్మం జిల్లా సకల ఉద్యోగుల వనసమారాధనలో మంత్రులు తుమ్మల, పొంగులేటి
ఖమ్మం కలెక్టరేట్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని, ప్రతీ ఉద్యోగి సంయమనం పాటిస్తే వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మంలోని చెరుకూరివారి తోటలో ఆదివారం జరిగిన ఖమ్మం జిల్లా సకల ఉద్యోగుల వనసమారాధన, ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, రెవెన్యూ మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రభుత్వాల తలరాతను మార్చే శక్తి కలిగిన ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయని తెలిపారు.
అయితే వాటిని పరిష్కరించేందుకు కాస్త సమయం కావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకుంటూ ప్రాధాన్య క్రమంలో ఒక్కో రంగం సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ఇక, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు నిరంతరం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.