Share News

child pornography: చైల్డ్‌ పోర్నోగ్రఫీ.. పోలీసులు గమనిస్తున్నారు జాగ్రత్త..!

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:14 AM

చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడడం మన దేశంలో నేరం. ఎవరూ గమనించడం లేదని ఎన్‌క్రిప్టెడ్‌ పద్ధతుల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోలు చూసినా.. గుర్తించే వ్యవస్థ పోలీసు శాఖకు అందుబాటులోకి వచ్చింది.

child pornography: చైల్డ్‌ పోర్నోగ్రఫీ.. పోలీసులు గమనిస్తున్నారు జాగ్రత్త..!

  • విస్తృతంగా సైబర్‌ పెట్రోలింగ్‌

  • వెబ్‌ ఇంటెలిజెన్స్‌తో ఆన్‌లైన్‌లో నిఘా

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడడం మన దేశంలో నేరం. ఎవరూ గమనించడం లేదని ఎన్‌క్రిప్టెడ్‌ పద్ధతుల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోలు చూసినా.. గుర్తించే వ్యవస్థ పోలీసు శాఖకు అందుబాటులోకి వచ్చింది. అంటే.. అదేపనిగా చిన్నారుల అశ్లీల (చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌-సీసామ్‌) చూసేవారు, వాటిని షేర్‌ చేసేవారిని ‘సైబర్‌ పెట్రోలింగ్‌’లో గుర్తిస్తున్నారు. తెలంగాణ పోలీసులకు అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీతో.. ఇతర రాష్ట్రాలపైనా చైల్డ్‌ పోర్నోగ్రఫీపై నిఘా పెడుతున్నారు. నాలుగు రోజుల క్రితం పశ్చిమబెంగాల్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూస్తున్న వ్యక్తిని సైబర్‌ పోలీసులు అక్కడి పోలీసులకు పట్టించారు.


  • భారత్‌లో పెరుగుతున్న జాఢ్యం

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు చైల్డ్‌ పోర్నోగ్రఫీని నిషేధించాయి. యునిసెఫ్‌ అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నెట్‌కెక్కుతున్న చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోల్లో 12ు భారత్‌ నుంచే అప్‌లోడ్‌ అవుతున్నాయి. ప్రతిరోజు సగటున చిన్నారులకు సంబంధించిన 25 వేల అశ్లీల ఫొటోలు, వీడియోలు నెట్‌లో అప్‌లోడ్‌ అవుతున్నాయి. బాధితుల్లో 80ు మంది బాలికలు ఉంటున్నారు.

  • సైబర్‌ పెట్రోలింగ్‌ నిఘా ఇలా..

ఆన్‌లైన్‌లో చిన్నారుల అశ్లీల సాహిత్యాన్ని వీక్షించేవారు, షేర్‌ చేసేవారు, విక్రయించే వారిని గుర్తించడం, మహిళల్ని వేధించేవారిని(సైబర్‌స్టేకర్స్‌) గుర్తించేందుకు పోలీసులు మూడు విధానాలను అనుసరిస్తూ.. సైబర్‌ పెట్రోలింగ్‌ను కొనసాగిస్తున్నారు. అవి-- వెబింట్‌, ఓసింట్‌, డీపింట్‌. వెబింట్‌లో వెబ్‌సైట్‌ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి, దాని ఆధారంగా అవతలి వారిని గుర్తిస్తున్నారు. ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌(ఓసింట్‌)తో ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న సైబర్‌ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. మూడోది అత్యంత కీలకమైన డీపింట్‌. దీన్నే డార్క్‌-ఇంట్‌ అంటారు. ఈ పద్ధతిలో డార్క్‌వెబ్‌తోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగే వెబ్‌సైట్‌లు, ఇతర గ్రూపుల్లో సైబర్‌ పెట్రోలింగ్‌ పోలీసులు సభ్యులుగా చేరుతారు.


  • 300 ప్రొఫైల్స్‌ గుర్తింపు

మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న షీ సైబర్‌ ల్యాబ్‌ నిర్వహించిన సైబర్‌ పెట్రోలింగ్‌లో.. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో వివిధ విభాగాల్లో 300 మంది ప్రొఫైల్స్‌ను పోలీసులు గుర్తించారు. అందులో సీసామ్‌ కేసులకు సంబంధించినవి అత్యధికంగా(180) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి 115, సైబర్‌ నేరాలకు సంబంధించి3, గృహ హింసకు సంబంధించి2 ప్రొఫైల్స్‌ ఉన్నాయి.


  • ఇతర రాష్ట్రాలకు సమాచారం

సైబర్‌ పెట్రోలింగ్‌లో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని వారిపైనా నిఘా కొనసాగిస్తున్నారు. తమకు లభించిన సమాచారాన్ని ఆయా రాష్ట్రాల పోలీసులకు అందించి, కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 180 చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌కు సం బంధించిన కీలక సమాచారాన్ని గుర్తించామని మహిళా భద్రత విభాగం చీఫ్‌ శిఖాగోయల్‌ తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా 65 ఇంటెలిజెన్స్‌ నివేదికలను రూపొందించి, 13 రాష్ట్రాల పోలీసులకు సమాచారాన్ని చేరవేశామన్నారు. తాము ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, 21 మంది అరెస్టయ్యారని వివరించారు.

రాష్ట్రం ఎఫ్‌ఐఆర్‌ల అరెస్టైన

నమోదు వారు

ఆంధ్రప్రదేశ్‌ 2 2

బిహార్‌ 1 1

ఢిల్లీ 1 1

మహారాష్ట్ర 1 1

రాజస్థాన్‌ 2 2

పశ్చిమ బెంగాల్‌ 01 --

తెలంగాణ 12 14

Updated Date - Nov 29 , 2024 | 04:14 AM