Share News

Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:00 AM

దేశంలోనే సైబర్‌ నేరాల్లో టాప్‌-5లో ఉన్న తెలంగాణలో.. బాధితులు ఈ ఏడాది ఏకంగా రూ.1,866.9 కోట్ల సొమ్మును పోగొట్టుకున్నారు. రికవరీలు మాత్రం పట్టుమని పదిశాతం కూడా లేకుండా.. రూ.176.71 కోట్లకు పరిమితం కావడం గమనార్హం..!

Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

  • ఏడాదిలో రూ.1,866.9 కోట్లు హాంఫట్‌

  • రికవరీ రూ.176.71 కోట్లు మాత్రమే

  • 2024లో మోసాలు 18% పెరుగుదల

  • అత్యధికం షేర్‌ మార్కెట్‌ పేరుతోనే..

  • పార్ట్‌టైమ్‌ కొలువులు, డిజిటల్‌ అరెస్టులు..

  • ఫేక్‌ కస్టమర్‌ కేర్‌, క్రెడిట్‌ కార్డు నేరాలూ

  • సైబర్‌ నేరాల వార్షిక నివేదిక

  • సీఎ్‌సబీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే సైబర్‌ నేరాల్లో టాప్‌-5లో ఉన్న తెలంగాణలో.. బాధితులు ఈ ఏడాది ఏకంగా రూ.1,866.9 కోట్ల సొమ్మును పోగొట్టుకున్నారు. రికవరీలు మాత్రం పట్టుమని పదిశాతం కూడా లేకుండా.. రూ.176.71 కోట్లకు పరిమితం కావడం గమనార్హం..! రూ.244.56 కోట్లను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) అధికారులు ఫ్రీజ్‌ చేశారు. ఈ ఏడాది సైబర్‌ నేరాలపై మొత్తం 1,14,174 ఫిర్యాదులు అందినట్లు సీఎ్‌సబీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ వెల్లడించారు. గత ఏడాది ఈ సంఖ్య 91,652గా ఉన్నట్లు తెలిపారు. సోమవారం ఆమె ఈ మేరకు ‘తెలంగాణ సైబర్‌ నేరాల వార్షిక నివేదిక’ను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి సైబర్‌ నేరాల పెరుగుదల 18ు పెరిగినట్లు స్పష్టం చేశారు. రోజుకు సగటున 316 మంది బాధితులు రూ.5.4 కోట్ల మేర నష్టపోతున్నారని నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది సైబర్‌ నేరాల్లో అత్యధికంగా షేర్‌మార్కెట్‌ మోసాలున్నాయని.. ఆ తర్వాతి స్థానాల్లో పార్ట్‌టైం ఉద్యోగాలు, డిజిటల్‌ అరెస్టు, నకిలీ కస్టమర్‌ కేర్‌ సర్వీ్‌సలు, క్రెడిట్‌ కార్డు మోసాలు నమోదైనట్లు శిఖాగోయల్‌ వివరించారు.


ప్రైవేటు ఉద్యోగులే బాధితులు

సైబర్‌ నేరాల బాధితుల్లో అధికంగా అక్షరాస్యులు, ప్రైవేటు ఉద్యోగులే ఉంటున్నారని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది నమోదైన మొత్తం కేసుల్లో 56ు మంది బాధితులు ప్రైవేటు ఉద్యోగులే. వీరిలో చిరుద్యోగులు మొదలు.. సాఫ్ట్‌వేర్‌ నిపుణుల దాకా ఉన్నారు. మిగతా బాధితుల్లో స్వయం ఉపాధిలో ఉన్నవారు(10ు), వ్యాపారులు(9ు), విద్యార్థులు(9ు), ప్రభుత్వోద్యోగులు(5ు), గృహిణులు(5ు), ఇతరులు(6ు) ఉన్నట్లు సీఎ్‌సబీ నివేదిక చెబుతోంది.


186 మంది అరెస్టు

నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే.. రికవరీలు పెరిగే అవకాశాలుంటాయని, ఈ ఏడాది 186 మంది సైబర్‌ కేటుగాళ్లను అరెస్టు చేశామని శిఖాగోయల్‌ వివరించారు. వీరంతా తెలంగాణలో నమోదైన 823 కేసులు.. దేశవ్యాప్తంగా 3,637 కేసుల్లో నిందితులని పేర్కొన్నారు. ‘‘మొదటిసారి మేము రాజస్థాన్‌లో అంతర్రాష్ట్ర ఆపరేషన్‌ నిర్వహించి, 27 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశాం. వీరికి బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్న 11 మందిని అరెస్టు చేశాం. ఆయా 2,194 కేసుల్లో 37 ఖాతాల నుంచి నగదు బదిలీ జరిగినట్లు గుర్తించాం. సైబర్‌ నేరాల కట్టడిలో భాగంగా 14,885 సిమ్‌ కార్డులు, 9,811 ఐఎంఈఐ నంబర్లను బ్లాక్‌ చేయించాం. 1,825 వెబ్‌సైట్లను తొలగించేలా చేశాం. సైబర్‌ నేరాల కట్టడి, నిందితుల అరెస్టులకు తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది’’ అని ఆమె వివరించారు. బ్యాంకుల ద్వారా నగదు బదిలీ చేయడంతో పోలీసులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో కేటుగాళ్లు రూటుమార్చి.. నగదు విత్‌డ్రా చేస్తున్నారని తెలిపారు. సైబర్‌ నేరాల్లో కొల్లగొట్టిన మొత్తాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చి.. దుబాయ్‌లో ఉండే ప్రధాన సూత్రధారులకు చేరవేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ తరహా ముఠాలకు చెందిన 21 మంది నిందితులను సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ, కరీంనగర్‌, జగిత్యాలల్లో అరెస్టు చేశామని తెలిపారు.


టాప్‌-5 నగరాలు ఇవే!

నగరం నేరాల సంఖ్య

సైబరాబాద్‌ 25,112

హైదరాబాద్‌ 20,299

రాచకొండ 14,815

వరంగల్‌ 3,531

సంగారెడ్డి 3,132

Updated Date - Dec 24 , 2024 | 05:00 AM