Rare Diseases: అరుదైన వ్యాధుల జాబితాలో 8వ స్థానంలో తెలంగాణ
ABN , Publish Date - Sep 02 , 2024 | 04:49 AM
దేశంలో అరుదైన వ్యాధులున్న టాప్ టెన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ (8వ స్థానం) కూడా ఉంది.
దేశవ్యాప్తంగా 13,479 కేసులు
మన రాష్ట్రంలో 661 గుర్తింపు.. వివరాలు వెల్లడించిన కేంద్రం
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): దేశంలో అరుదైన వ్యాధులున్న టాప్ టెన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ (8వ స్థానం) కూడా ఉంది. ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు దేశవ్యాప్తంగా 13,479 మంది ఉండగా... తెలంగాణలో 661 మంది ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వివరాలను ఇటీవలే కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంటుకు నివేదించింది. మొదటి స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 1,976 మంది, మహారాష్ట్రలో 1,387, కర్ణాటకలో 1,275, తమిళనాడులో 1,201, అసోంలో 898, ఢిల్లీలో 879, ఆంధ్రప్రదేశ్‌లో 684, తెలంగాణలో 661, పశ్చిమ బెంగాల్‌లో 642, బిహార్‌లో 608 మంది ఉన్నారు. మొత్తం కేసుల్లో 75 శాతం (10,211 మంది) ఈ పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. టాప్ టెన్‌లో 4దక్షిణాది రాష్ట్రాలు ఉండగా.. అక్కడ 28 శాతం కేసులు ఉన్నాయి.
కాగా, 63 రకాల వ్యాధులను అరుదైనవి కేంద్రం గుర్తించింది. చికిత్స అందించేందుకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపింది. అందులో తెలంగాణలోని నిమ్స్ కూడా ఉంది. ఈ వ్యాధులను గుర్తించడం ఎంతో కష్టతరం. దీనికి అమెరికాలో సగటున 7.6, బ్రిటన్‌లో ఐదున్నరేళ్ల సమయం పడుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కనీసం 8 మంది ఫిజీషియన్లు చూసి, పలు రకాల పరీక్షలు జరిపిన తర్వాత కానీ గుర్తించలేకపోతున్నారు.
రోగ నిరోధక శక్తి లోపాలు, గౌచర్స్ వ్యాధి, మ్యూకోపాలిసాకరిడోసెస్, పాంపే, ఫాబ్రీ, మాపుల్ సిరప్ యూరిన్ వ్యాధులు, ఆర్గానిక్ అసిడెమియాస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆస్టియోజెనిసిస్, కొన్ని రకాల కండరాల క్షీణత లాంటివి అరుదైన వ్యాధుల జాబితాలో ఉన్నాయి. కాగా, అరుదైన వ్యాధులతో బాధపడుతున్నవారిచికిత్సకు రూ.50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 2021 వరకు ఇది రూ.20 లక్షల వరకే ఉండగా దాన్ని రూ.50 లక్షలకు పెంచామని కేంద్రం పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.24.20 కోట్లు, గత నాలుగేళ్లలో రూ.136.34 కోట్లు కేటాయించామని తెలిపింది.