Share News

Tender Process: సెప్టెంబరులో ఉచిత చేప పిల్లల పంపిణీ!

ABN , Publish Date - Aug 15 , 2024 | 02:36 AM

ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి మార్గం సుగమం అయ్యింది. పాత బకాయిలు చెల్లించలేదని రెండు దఫాలుగా టెండర్లు వేయని కాంట్రాక్టర్లు.. మూడో దఫాలో దాఖలు చేశారు.

Tender Process: సెప్టెంబరులో ఉచిత చేప పిల్లల పంపిణీ!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి మార్గం సుగమం అయ్యింది. పాత బకాయిలు చెల్లించలేదని రెండు దఫాలుగా టెండర్లు వేయని కాంట్రాక్టర్లు.. మూడో దఫాలో దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 84 టెండర్లు దాఖలయ్యాయి. వీటికి మంగళవారంతో గడువు ముగిసింది. కాంట్రాక్టర్ల చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రాలను మత్స్యశాఖ అధికారులు తనిఖీ చేసిన తర్వాత టెండర్లను ఖరారు చేయనున్నారు. ఈనెలాఖరు వరకు టెండర్లు, ఎల్‌-1 ఏజెన్సీల ఎంపిక, ఒప్పందాలు పూర్తిచేసి.. సెప్టెంబరులో చేపపిల్లల పంపిణీని పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల నీటి వనరుల్లో 86 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు పోయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ పథకానికి రూ.114 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. గత ఏడాది చేపపిల్లలు సరఫరా చేసినా కేసీఆర్‌ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, రూ.96.52 కోట్లు విడుదల చేసిన తర్వాతే టెండర్లలో పాల్గొంటామని కాంట్రాక్టర్లు మొదట మొండికేశారు. దీంతో రెండుసార్లు గడువు పొడిగించాల్సి వచ్చింది. మత్స్యశాఖ అధికారులు వారితో చర్చలు జరిపి టెండర్లలో పాల్గొనేలా ఒప్పించారు. కాగా, హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో చేపపిల్లల సరఫరాకు టెండర్లు పిలవగా.. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో దాఖలు కాలేదు. ఈ నాలుగు జిల్లాల్లో పంపిణీ బాధ్యతను పొరుగు జిల్లాల్లోని ఏజెన్సీలకు అప్పగించే వెసులుబాటు ఉంది. చేపపిల్లల టెండర్ల ప్రక్రియను కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా చేపడుతున్నారు. రొయ్య పిల్లల టెండర్లను రాష్ట్రం యూనిట్‌గా మత్స్య శాఖ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

Updated Date - Aug 15 , 2024 | 02:36 AM