Infrastructure: ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ అలైన్‌మెంట్‌పై కమిటీ!
ABN , Publish Date - Sep 21 , 2024 | 03:23 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి.
ఆర్ అండ్ బీ ప్రత్యేక సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు
వడివడిగా దక్షిణ భాగం రహదారి పనులు
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. రహదారి మార్గాన్ని (అలైన్‌మెంట్) ఖరారు చేసేందుకు గాను సర్కారు ఐఏఎస్ అధికారులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా మరో 12 మంది అధికారులతో కమిటీని నియమించింది. దక్షిణ భాగం రహదారి అలైన్‌మెంట్‌తో పాటు ఔటర్ రింగు రోడ్డు నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన రేడియల్ రోడ్ల అలైన్‌మెంట్లను తయారు చేసే బాధ్యతలను కూడా ఈ కమిటీకి అప్పగించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం రహదారి అలైన్‌మెంట్, భూసేకరణ, పరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీని నియమించనుందన్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ఈ మేరకు ‘‘రింగు’కు కమిటీ.. ఇరువైపులా ఐటీ’’ శీర్షికన శుక్రవారం కథనాన్ని ప్రచురించింది. దక్షిణ భాగం రోడ్డు కోసం సర్కారు నియమించనున్న కమిటీలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారి సహా వివిధ శాఖల అధికారులతో పాటు ఈ రహదారి నిర్మితమయ్యే జిల్లాల కలెక్టర్లు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అలైన్‌మెంట్ ఖరారు కోసమే కమిటీని ఏర్పాటు చేస్తున్నప్పటికీ రోడ్డు నిర్మాణానికి సేకరించే భూమి, చెల్లించాల్సిన పరిహారంపై కూడా కసరత్తు చేయనుంది.
ప్రాథమికంగా రూపొందించిన మ్యాప్ ప్రకారం దక్షిణ భాగం నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌లో ప్రారంభమై సంగారెడ్డి జిల్లాలోని ఉత్తర భాగం రహదారికి అనుసంధానం కానుంది. ఇది దాదాపు 194 కి.మీ. ఉండనుంది. అలైన్‌మెంట్ ఖరారుకు కమిటీని నియమించిన నేపథ్యంలో రహదారి మార్గంలో పలు మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలిసింది. అలైన్‌మెంట్‌తో పాటు ఈ రోడ్డుకు ఇరువైపులా ఐటీ, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, తద్వారా కలిగే ప్రయోజనాలు, ఈ మార్గంలో ఐటీ, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపైనా కమిటీ లోతుగా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. అలైన్‌మెంట్ ఖరారు అనంతరం ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.