Skill University: న్యూయార్క్‌ను మించేలా ముచ్చర్లను నిర్మిస్తాం..
ABN , Publish Date - Aug 02 , 2024 | 03:07 AM
ముచ్చర్లలో న్యూయార్క్‌ను మించిన మహానగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నిజాం నవాబు హైదరాబాద్‌ను, బ్రిటి్‌షవాళ్లు సికింద్రాబాద్‌ను, చంద్రబాబు, వైఎ్‌సలు సైబరాబాద్‌ను నిర్మించగా.. నాలుగో నగరాన్ని తాము ముచ్చర్లలో నిర్మిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ సిటీ
భూములిచ్చిన వారికి అండగా ఉంటాం
57 ఎకరాల్లో 150 కోట్లతో స్కిల్ వర్సిటీ
శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మెట్రో
ఓఆర్‌ఆర్‌ను కలిపేలా 200అడుగుల రోడ్డు
3 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు పనులు
150 కోట్లతో స్కిల్ వర్సిటీ నిర్మాణం
వర్సిటీ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/కందుకూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ముచ్చర్లలో న్యూయార్క్‌ను మించిన మహానగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నిజాం నవాబు హైదరాబాద్‌ను, బ్రిటి్‌షవాళ్లు సికింద్రాబాద్‌ను, చంద్రబాబు, వైఎ్‌సలు సైబరాబాద్‌ను నిర్మించగా.. నాలుగో నగరాన్ని తాము ముచ్చర్లలో నిర్మిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డు నిర్మాణం వల్ల శివారు ప్రాంతాల్లో ఎకరా రూ.100 కోట్ల వరకు ధరలు పెరిగాయని రేవంత్ చెప్పారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయనున్న అధునాతన మహానగరంతో చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయన్నారు. వేలాది ఎకరాల భూముల్లో న్యూయార్క్, సింగపూర్, దుబాయ్‌లకు మించిన మహానగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. కాలుష్యరహిత పరిశ్రమలతో పాటు విద్య, ఆరోగ్యం, పర్యాటక హబ్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘కొందరు వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈ వేదిక ద్వారా ఒకటే చెబుతున్నా.. ఇక్కడకు రూ.వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి న్యూయార్క్ కంటే అధునాతన నగరాన్ని కచ్చితంగా నిర్మిస్తాం’ అని రేవంత్ స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 57 ఎకరాల్లో రూ.150 కోట్లతో స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ముచ్చర్ల-బేగరి కంచె ప్రాంతం రూపురేఖలన్నీ మారిపోతాయని చెప్పారు. ఈ ప్రాంతానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెట్రోలైన్ అనుంసధానం చేస్తామని, అలాగే ఔటర్ రింగురోడ్డుకు నేరుగా వెళ్లేందుకు 200 అడుగుల రోడ్డు నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఈ భూసేకరణ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అప్పగిస్తున్నట్లు తెలిపారు.
ముచ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు ఇచ్చిన రైతులందరికీ అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రైతు కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ ఇప్పించి, వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ముందుగా ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం తీసుకుని, అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, ఇళ్లకు కూడా వెళ్లకుండా సరాసరి ఇక్కడకే వచ్చామని రేవంత్ తెలిపారు. యూనివర్సిటీ నుంచి ఏటా వేలాది మందికి శిక్షణ ఇచ్చి రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు అందిస్తామని వెల్లడించారు. అలాగే ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రిజర్వుడు ఫారె్‌స్టను అభివృద్ధి చేసి నైట్ సఫారీ ఏర్పాటు చేస్తామని, పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వర్సిటీలో అడ్మిషన్ వస్తే జాబ్ గ్యారెంటీ!
తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగ సమస్య ఒక కారణమని, లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యమంలో ముందు నడిచారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఏటా లక్ష మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారని.. నైపుణ్యాలు లేకపోవడంతో వారికి ఉద్యోగావకాశాలు దక్కడం లేదని చెప్పారు. స్కిల్ వర్సిటీ నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తుందన్నారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు, అధికారులు దీనికి సహకరిస్తున్నారని చెప్పారు. ప్రజాప్రభుత్వం గొప్ప ఆశయంతో, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వర్సిటీలో అడ్మిషన్ వస్తే జాబ్ గ్యారెంటీ అని సీఎం పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో శిక్షణ పొందే వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇప్పటికే రెడ్డి ల్యాబ్, ఎస్‌బీఐ లాంటి సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు మూడు నెలల్లో చేపడతామని సీఎం చెప్పారు. ఓఆర్‌ఆర్ పనులు వైఎస్ చేపడితే ఆర్‌ఆర్‌ఆర్ పనులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నాయని తెలిపారు.
అందరి సహకారంతో నిర్మాణం: శ్రీధర్‌బాబు
అందరి సహకారంతో ముచ్చర్లలో కొత్త నగర నిర్మాణాన్ని పూర్తిచేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. కొత్త ఆలోచనతో కొత్త నగర నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ముందడుగు వేశామని చెప్పారు. నూతన మహానగరంలో ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి స్థానికుల సహకారం ఎంతో అవసరమన్నారు.
కార్యక్రమానికి సబిత దూరం
స్కిల్ వర్సిటీ శంకుస్థాపన కు స్థానిక ఎమ్మెల్యే సబిత దూరంగా ఉన్నారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్, సబిత మధ్య వాగ్వాదం జరగడం, ఆమె కన్నీరు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో జరిగిన సీఎం కార్యక్రమానికి సబిత హాజరు కాకపోవడం గమనార్హం. గురువారం సాయంత్రం శంకుస్థాపన ఉంటే అధికారులు తనకు ఉదయం సమాచారం ఇచ్చారని, ప్రజాప్రతినిధులతో వ్యవహరించే తీరు ఇదేనా? అని సబిత ప్రశ్నించారు. వేదికపై వేసిన పోస్టర్‌లో కూడా తన ఫొటో లేదని చెప్పారు.
అల ముచ్చర్ల నగరిలో!!
13,973 ఎకరాల విస్తీర్ణంలో నెట్ జీరో సిటీ
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
ముచ్చర్లలో నిర్మించ తలపెట్టిన నెట్ జీరో సిటీ(కర్బన ఉద్గార రహిత నగరం) అభివృద్ధికి ప్రభుత్వం అద్భుత ప్రణాళిక సిద్ధం చేసింది. 14వేల ఎకరాల్లో 10 హబ్‌లుగా నిర్మాణాలు చేపట్టనుంది. సీఎంకు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 13,973 ఎకరాల విస్తీర్ణంలో నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఈ విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో 4,774 ఎకరాలను ఎలకా్ట్రనిక్, జనరల్ ఇండస్ట్రీస్ కోసం కేటాయించారు. 4,207 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. 1,013 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్, 761 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మిక్స్‌డ్ యూజ్ కోసం 470 ఎకరాలు, ఎడ్యుకేషన్ వర్సిటీ జోన్‌కు 454 ఎకరాలు, ఏఐ సిటీ కోసం 297 ఎకరాలు కేటాయించారు. ఇవి కాక, పక్కనే ఉన్న రిజర్వు ఫారెస్టులో నైట్ సఫారీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.
ఇంత కంటే ఆత్మ సంతృప్తి ఏముంటుంది?: భట్టి
సభలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సీఎం రేవంత్‌రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. ముచ్చర్లలో జరుగుతున్న కార్యక్రమాన్ని సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అభివర్ణించారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న తపన, అందులో నుంచి వచ్చిన ఆలోచనలే ఈ బృహత్తర కార్యక్రమానికి పునాది అని చెప్పారు. రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం తమకు ఎంతో సంతృప్తి కలిగిస్తోందని, ఇంత కంటే ఆత్మ సంతృప్తి మరేదీ ఉండదన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఈ యూనివర్సిటీ మంచి భవిష్యత్తును అందిస్తుందన్నారు. గత ఫ్రభుత్వం భూములన్నింటినీ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిందని, భూములు ఇచ్చిన వారు ఏమైనా పర్వాలేదన్నట్టుగా వ్యవహరించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 600 ఎకరాల్లో ఇళ్లు నిర్మించనుందని వెల్లడించారు. ఏడాదిలో ఈ ప్రాంత రూపురేఖలు మార్చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో మంత్రి శ్రీధర్‌బాబు కృషి ఎంతో ఉందన్నారు.