Share News

Hyderabad: రేపటి కోసం రోడ్‌ మ్యాప్‌..

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:24 AM

ప్రపంచంతోపాటు వేగంగా ప్రయాణించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Hyderabad: రేపటి కోసం రోడ్‌ మ్యాప్‌..

  • అంతర్జాతీయ సదస్సులో ఏఐ సిటీ ప్రణాళిక ప్రకటిస్తాం

  • పదింతల అభివృద్ధికి ‘కృత్రిమ మేధ’ దోహదం

  • పోటీ ప్రపంచంలో ‘ఏఐ’తో ప్రయాణించాల్సిందే

  • తొలిదశలో వ్యవసాయం, విద్య, వైద్యంలో వినియోగం

  • 35 శాఖల్లో ఏఐతో మెరుగైన పాలనపై కసరత్తు

  • పెద్ద సంఖ్యలో కొలువులు పోయినా.. కొత్తవీ వస్తాయి

  • నష్ట నివారణ చర్యలపైనే ఎక్కువగా దృష్టి సారించాం

  • వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది లేకుండా చర్యలుంటాయి

  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

    ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేక ముఖాముఖి

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంతోపాటు వేగంగా ప్రయాణించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న అంతర్జాతీయ ఏఐ సదస్సుకు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఆయన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏఐ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఆయన పంచుకున్నారు. ఏఐ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోందని, అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.


ఈ తరుణంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరింత మెరుగైన సుపరిపాలన అందించేందుకు సమావేశాన్ని ఉపయోగించుకుంటామని మంత్రి చెప్పారు. ప్రత్యేక పరిశోధనల కోసం ఏఐ సిటీ ఏర్పాటుకు ఇప్పటికే 200 ఎకరాలు కేటాయించడాన్ని గుర్తుచేస్తూ ఏఐ సిటీ రోడ్‌ మ్యాప్‌నూ సదస్సులో ప్రకటిస్తామని చెప్పారు. అభివృద్ధి పదింతలు ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ రోడ్‌ మ్యాప్‌ ఉంటుందన్నారు. వాణిజ్యం, వ్యాపార, పారిశ్రామికాభివృద్ధిలో ఏఐని ఉపయోగించుకోవడం ద్వారా మరింత అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యం అని పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ రంగంలో ప్రపంచ ఖ్యాతి పొందిన హైదరాబాద్‌ ఏఐలోనూ ప్రత్యేకత చాటాలన్నది ఈ రెండు రోజుల సమావేశం ఏర్పాటు వెనక ప్రభుత్వ ఉద్దేశ్యం అని చెప్పారు.


ఈ సదస్సుకు ఏఐ రంగంలో నిపుణులు, ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజాలను ఆహ్వానించామని, సదస్సులో దాదాపు 2వేల మంది నిపుణులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఏఐ వినియోగంపై నిపుణులతో చర్చలు జరుపుతామని, మొత్తంగా ఏఐకి సంబంధించిన 28 అంశాలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. ఇంతవరకు ఇలాంటి సదస్సులు ప్రైవేటు రంగాల్లో చేశారని, తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో నాస్కామ్‌తో సంయుక్తంగా చేస్తున్నామని చెప్పారు. రేపటి అడుగుకు ఈ సమావేశం నాంది పలుకుతుందని, రెండు రోజుల సమావేశంలో చర్చించి తెలంగాణ ఏఐ పాలసీ రూపొందిస్తామని పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్న మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..


  • అవును.. అదే అతిపెద్ద సవాల్‌

ఏఐతో కోల్పోయే ఉద్యోగాలు రాష్ట్రానికి అతిపెద్ద సవాల్‌. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా సహజంగానే ఇలాంటి ఆందోళన ఉంటుంది. మునుపు కంప్యూటర్లు వచ్చినప్పుడూ ఇలాంటి ఆందోళనే వ్యక్తమైంది. కంప్యూటర్లను వ్యతిరేకిస్తూ అప్పట్లో ఉద్యమాలే జరిగాయి. ఏఐ రాకతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలాంటి పరిస్థితే నెలకొంది. ఏఐతో ఇవాళ కూడా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.. దీన్ని నేను కాదనడం లేదు. అయితే ఏఐతో కొత్త ఉద్యోగాలూ వస్తాయి. రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ఇంజినీర్లు పుట్టుకొస్తున్నారు.


వీరిలో అత్యధికులు కోడింగ్‌, అల్గారిథమ్‌ రంగంలో ఉన్నారు. ఏఐ వస్తే కోడింగ్‌ కనుమరుగైపోతుంది. అలాంటప్పుడు వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాలపైనా సదస్సులో ప్రధాన అంశంగా చర్చ జరుపుతున్నాం. నిపుణుల సూచనలు స్వీకరిస్తాం. అయితే ఏఐ రాకతో నష్టనివారణ చర్యల కోసం ‘రెగ్యులేటరీ ఫ్రేమ్‌ వర్క్‌’ రూపొందించి నిపుణుల సూచనలూ స్వీకరిస్తాం. ఏఐ రంగంతోపాటు ఇతర రంగాల్లోనూ నైపుణ్యాల అభివృద్ధికి ఇప్పటికే యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ప్రకటించాం. ఉద్యోగాల కల్పనకు అందులో శిక్షణ ఇవ్వబోతున్నాం.


  • వ్యవసాయశాఖలోనూ ఏఐ

సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సామాన్యుల జీవితాల్లో మార్పు తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ఏఐని ఉపయోగిస్తాం. ఇప్పటికే వ్యవసాయ శాఖలో దీనిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు పంట వేయడం, భూమి పరిస్థితి, పంట వ్యవధి.. లాంటి సమాచార సేకరణకు ఏఐని ఉపయోగిస్తాం. రసాయన, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటకు అధిక ధర వచ్చే మార్కెట్‌ గురించి రైతులకు సమస్త సమాచారం అందించడంలో ఏఐ వినియోగం ఉంటుంది. విద్య, వైద్య రంగంలో ఈ సాంకేతికతను వినియోగించేందుకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి డిజిటల్‌ హెల్త్‌ కార్డ్‌ ఇవ్వబోతున్నాం. అందులోనూ ఏఐ వినియోగిస్తాం. విద్యార్థుల్లో ఏ స్థాయిలో దీన్ని ఉపయోగించాలన్న అంశంపై నిపుణులతో చర్చిస్తున్నాం. పాఠ్యాంశాల్లోనూ దీన్ని చేరుస్తాం. 35 ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు అందించే సేవలు మరింత మెరుగ్గా అందించేలా ఏఐ వినియోగం ఉంటుంది.


  • ఇతర ఎమర్జింగ్‌ టెక్నాలజీల గురించి..

ఏఐతోపాటు ఇతర ఎమర్జింగ్‌ టెక్నాలజీపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. డేటా అనాలటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చైన్‌ రంగాల్లోనూ పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వచ్చే నెలలో సైబర్‌ సెక్యూరిటీపై ఎస్పీలు, కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారులతో సదస్సు నిర్వహించబోతున్నాం. సైబర్‌ రంగంపై నిపుణులతో శిక్షణ ఇవ్వబోతున్నాం. రాష్ట్రం నుంచి యూనికార్న్‌ (బిలియన్‌ డాలర్ల) కంపెనీలు ఏర్పాటయ్యేలా ఇక్కడి యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది. త్వరలో నూతన పారిశ్రామిక పాలసీ, ఎంఎ్‌సఎంఈ పాలసీ, బయోటెక్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ, ఐటీ పాలసీ తీసుకురాబోతున్నాం. ఐటీ పాలసీపైనా ఈ రెండు రోజుల సదస్సులో చర్చ జరపబోతున్నాం.


  • ..అలా ఔషధాల ధరలు తగ్గుతాయి

ప్రజల జీవితాలు మరింత మెరుగ్గా చేయడం, పదింతలు వేగంగా అభివృద్ధి సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ టెక్నాలజీని పెద్దఎత్తున వినియోగించాలని నిర్ణయించాం. దీని ఫలాలు సామాన్యులకూ అందుతాయి. ఫార్మా రంగంలో ఏఐని పెద్దఎత్తున వినియోగించనున్నారు. ఫలితంగా ఉత్పాదకత ఎన్నో రెట్లు పెరిగి ఔషధాల ధరలూ తగ్గుముఖం పడుతాయి. దీంతో సామాన్యులకూ మేలు జరుగుతుంది. ఇతర రంగాల్లోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.


  • వ్యక్తిగత గోప్యత రక్షణకు చర్యలు

వ్యక్తిగత గోప్యత అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం బహిర్గతం కాకుండా, వారి గోప్యత రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డేటా ప్రైవసీపై త్వరలో ఒక ఫ్రేమ్‌ వర్క్‌ రూపొందిస్తాం. ప్రభుత్వ పాత్ర ఏమిటన్నది పరిశీలించి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 05 , 2024 | 04:24 AM