Jupalli Krishna Rao: పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణ
ABN , Publish Date - Aug 29 , 2024 | 03:28 AM
తెలంగాణ పర్యాటక రంగ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి దర్శనీయ గమ్యస్థానంగా మారుస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
బ్యాంకాక్ ట్రావెల్ మార్ట్‌లో మంత్రి జూపల్లి
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పర్యాటక రంగ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి దర్శనీయ గమ్యస్థానంగా మారుస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని క్వీన్ సిరికిట్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ (పాటా) ట్రావెల్ మార్ట్‌లో తెలంగాణ పర్యాటక పెవిలియన్‌ను మంత్రి ప్రారంభించారు. ఇందులో 45 దేశాలకు చెందిన సుమారు 900 మంది ప్రతినిధులు, భారత్ నుంచి తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాల పర్యాటక శాఖ అధికారులు పాల్గొంటున్నారు.
తెలంగాణలోని చారిత్రక, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాల ప్రాశస్త్యాన్ని అంతర్జాతీయంగా పరిచయం చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర పర్యాటక సంస్థ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా నాగర్జున సాగర్‌లోని బుద్దవనం, హైదరాబాద్‌లోని చార్మినార్, కుతుబ్ షాహీ టూంబ్స్, ములుగు జిల్లాలోని లక్నవరం తీగల వంతెన ఛాయాచిత్రాల్ని ప్రదర్శిస్తున్నారు. థాయిలాండ్‌లో భారత రాయబారి నగేష్ సింగ్, ‘పాటా’ ఇండియా చాప్టర్ ఎగ్జ్జిక్యూటివ్ డైరెక్టర్ రణీఫ్ సన్షా, థాయిలాండ్, వివిధ దేశాల ప్రతినిధులతో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు రావాలని జూపల్లి వారిని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఘనమైన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనతో ముందుకెళుతున్నట్లు తెలిపారు.