TG Assembly: హరీశ్ ఏ హోదాలో సభలో మాట్లాడుతున్నారు?: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Dec 20 , 2024 | 04:50 AM
అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మరోసారి వాడీవేడి సంభాషణ జరిగింది. గురువారం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెంకట్‌రెడ్డి ప్రశ్న అడిగారు.
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మరోసారి వాడీవేడి సంభాషణ జరిగింది. గురువారం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెంకట్‌రెడ్డి ప్రశ్న అడిగారు. దీంతో హరీశ్ రావు కల్పించుకుని ఒక మంత్రి, మరో మంత్రిని ప్రశ్న అడగడం ఏమిటని ప్రశ్నించారు. సభలో మంత్రులు ప్రశ్నలు అడిగే సంప్రదాయం లేదని, ఇలాగైతే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారుతుందని హరీశ్ అనడంతో మంత్రి కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. అసలు హరీశ్ రావు ఏ హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ డిప్యూటీ లీడరా... ఎమ్మెల్యేనా... ఏ హోదాలో మాట్లాడుతున్నారో చెప్పాలని నిలదీశారు. ఏడాదిగా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం ప్రజల్ని అవమానించడమేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
నల్లగొండ గురించి, తన గురించి మాట్లాడే హక్కు హరీశ్‌కు లేదని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ... నల్లగొండ జిల్లాలో ప్రజలు కింద ఫ్లోరైడ్... పైన మూసీ నీటితో ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో 70ు పూర్తి అయిన పనుల్ని గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టిందన్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ... సభలో మంత్రులు ప్రశ్నించే పరిస్థితి ఉండదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలను ఉమ్మడి నల్లగొండకు అందించామని, అవసరమైతే దీనిపై చర్చ పెట్టాలని సూచించారు. కాగా, బుధవారం నాటి సభలో హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు బీఆర్‌ఎ్‌స ఫిర్యాదు చేసింది.