Group-1 Exam: చలో సచివాలయం ఉద్రిక్తం..
ABN , Publish Date - Oct 20 , 2024 | 03:33 AM
జీవో నెంబర్ 29ని రద్దు చేసిన తరువాతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు నిర్వహించిన చలో సచివాలయం ఉద్రిక్తతకు దారితీసింది.
అభ్యర్థులకు మద్దతుగా పాల్గొన్న బండి
బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు నిరసన సెగ
అట్టుడికిన హైదరాబాద్‌లోని అశోక్‌నగర్
కవాడిగూడ/చిక్కడపల్లి/హైదరాబాద్ సిటీబ్యూరో/అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జీవో నెంబర్ 29ని రద్దు చేసిన తరువాతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు నిర్వహించిన చలో సచివాలయం ఉద్రిక్తతకు దారితీసింది. అశోక్‌నగర్ చౌరస్తాలోని పిల్లర్ నెంబర్ 21 వద్ద గ్రూప్ వన్ అభ్యర్థులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మద్దతు ప్రకటించి స్వయంగా ఆందోళనలో పాల్గొన్నారు. అక్కడ నుంచి చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి, ఆ తర్వాత అశోక్‌నగర్ చౌరస్తాకు చేరుకున్నారు. తమకు బాసటగా నిలిచిన బండి సంజయ్‌కు నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలని కూడా చూడకుండా దారుణంగా కొట్టి 12 గంటలపాటు నిర్బంధించారని వాపోయారు.
ఆ తర్వాత గ్రూప్ 1 బాధితులకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. విషయం తెలుసుకున్న బీజేపీ యువ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి గ్రూప్ 1 అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. భారీగా తరలివస్తున్న నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు ఇబ్బందులు పడ్డారు. నిరుద్యోగులను బయటకు రాకుండా అడ్డుకునేందుకు యత్నించారు. ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాదాపు గంటసేపు అశోక్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పోలీసులు వెళ్లిపొమ్మన్నా భీష్మించిన సంజయ్
ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు బండి సంజయ్ వద్దకు వచ్చి అక్కడి నుంచివెళ్లిపోవాలని అభ్యర్థించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేసేంతవరకు కదిలేది లేదంటూ ఆయన నిరసనను కొనసాగించారు. ఆ తర్వాత సచివాలయం ముట్టడి కార్యక్రమానికి ర్యాలీగా బయలు దేరారు. గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ ర్యాలీగా సచివాలయ ముట్టడికి వెళ్తుండగా లోయర్ ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ర్యాలీలో పాల్గొనేందుకు యత్నించారు. మాజీమంత్రి వి. శ్రీనివా్‌సగౌడ్, ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ తదితరులు ర్యాలీలో పాల్గొనేందుకు యత్నించారు. వీరిని బీజేపీ మహిళా కార్యకర్తలు అడ్డుకొని బీఆర్‌ఎస్ నేతలు గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో పాల్గొనేందుకు యత్నించిన మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చే శారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణుల మద్య మళ్లీ వాగ్వాదం
తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై మళ్లీ బైఠాయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ జత కలిశారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు రాగానే మరోసారి బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణుల మద్య వాగ్వాదం జరిగింది. బీఆర్‌ఎస్ నేతలకు వ్యతిరేకంగా గ్రూప్ 1 అభ్యర్థులు, బీజేపీ నేతలు నినాదాలు చేశారు. 15 నిమిషాల పాటు బీఆర్‌ఎస్ నేతలు కూడా రోడ్డుపై బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్తత పెరుగుతుండటంతో పోలీసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, దాసోజు శ్రవణ్ తదితరులను అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించారు. ఆ తర్వాత సచివాలయం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించిన బండి సంజయ్‌ని పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించారు. సంజయ్‌ని తీసుకెళుతున్న వాహనాన్ని గ్రూప్ 1 అభ్యర్థులు, బీజేపీ నేతలు కొద్దిదూరం వెంబడించారు. సంజయ్‌ని నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేర్చి ఊపిరిపీల్చుకున్నారు.
చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ బదిలీ
శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీఛార్జి చేయడంతో చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య బదిలీ అయ్యారు. ఆయనను స్పెషల్‌బ్రాంచి(ఎ్‌సబీ)కి బదిలీ చేస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.