Bhatti Vikramarka: లిథియం నిల్వల వెలికితీతపై దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Aug 18 , 2024 | 03:10 AM
భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని, ఈ నేపథ్యంలో బ్యాటరీల కోసం వినియోగించే లిథియంతోపాటు ఇతర మూలకాల అన్వేషణ, వెలికితీతపై సింగరేణి దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.
సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకీ అడుగుపెట్టాలి: భట్టి
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని, ఈ నేపథ్యంలో బ్యాటరీల కోసం వినియోగించే లిథియంతోపాటు ఇతర మూలకాల అన్వేషణ, వెలికితీతపై సింగరేణి దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఎంతో నిష్ణాతులైన సిబ్బంది, తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి సంస్థ ఇతర మైనింగ్ రంగాల్లోకీ అడుగుపెట్టాలని ఆయన సూచించారు. శనివారం సచివాలయంలో సింగరేణి సంస్థ అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
మనుగడను సాగిస్తూనే ఆస్తులను, సంపదను సృష్టించుకోవాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఫ్లోటింగ్ సోలార్‌తోపాటు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నామని, దీనికి సంబంధించి డీపీఆర్‌లను రూపొందించి త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. ఒడిశాలోని నైనీ బ్లాకులో బొగ్గు ఉత్పత్తి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని భట్టి ఆరా తీయగా, త్వరలోనే చేపడతామని ఆయన చెప్పారు.