Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ గడువు 2 నెలలు పొడిగింపు
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:49 AM
కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ కోసం వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నెలాఖరు లేదా జనవరిలో తదుపరి విచారణ
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ కోసం వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా కమిషన్‌కు ఇచ్చిన గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. అయితే కమిషన్ విచారణ కీలక దశలో ఉండటం... రానున్న జనవరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్ లను కమిషన్ విచారించే అవకాశాలున్నాయి.
ఇక కంప్రోల్టర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) ప్రతినిధులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. మరోవైపు ఈ దఫా విచారణ ముగించుకొని శనివారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కోల్‌కతాకు తిరిగి వెళ్లిపోయారు. ఈ నెలాఖరున క్రిస్మస్ సెలవుల అనంతరం లేదా జనవరి తొలి వారంలో హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక తాజా గడువుతో 2025 ఫిబ్రవరి 28వ తేదీలోగా నివేదిక అందించాలని ప్రభుత్వం కోరింది. ఈమేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.