Loan Waiver: ఆ పైచిలుకు మాటేంటి?
ABN , Publish Date - Aug 20 , 2024 | 03:06 AM
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్న ప్రభుత్వం.. రూ.2 లక్షలకు మించి తీసుకున్న రుణాల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు.
2 లక్షల పైమొత్తం ఎప్పుడు చెల్లించాలి?.. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వని ప్రభుత్వం
రైతులు చెల్లించేందుకు ముందుకొస్తున్నా..
తీసుకునేందుకు నిరాకరిస్తున్న బ్యాంకర్లు
సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న రైతులు
క్యాబినెట్‌లో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం!
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్న ప్రభుత్వం.. రూ.2 లక్షలకు మించి తీసుకున్న రుణాల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. ఇప్పటికే రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసినా.. పలు కారణాల వల్ల ప్రయోజనం పొందని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో.. రేషన్‌కార్డులు లేనివారు, ఆధార్ సరిపోలని వారు, ఇతర సాంకేతిక కారణాలతో రుణమాఫీ అందనివారి ఖాతాలను పరిశీలించి సమస్యను పరిష్కరించనున్నారు.
కానీ, రూ.2 లక్షలకు మించి రుణం తీసుకున్న రైతుల విషయంలో మాత్రం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. రుణమాఫీకి సంబంధించి జూలై 15న జారీ చేసిన జీవోలో మాత్రం రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు.. ఆ పైమొత్తాన్ని చెల్లించాలని, ఆ తరువాతే మిగిలిన రూ.2 లక్షలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని పేర్కొంది. కానీ, ఆ పైమొత్తాన్ని ఎప్పుడు చెల్లించాలి? ఎప్పటివరకు చెల్లించాలి? అనే విషయం మాత్రం చెప్పలేదు. దీంతో ఇటు రైతుల్లో, అటు బ్యాంకర్లలో అయోమయం నెలకొంది.
పైమొత్తాన్ని చెల్లించేందుకు కొందరు రైతులు ముందుకు వస్తున్నా.. బ్యాంకర్లు ఆ సొమ్ము తీసుకోవడంలేదు. పైమొత్తాన్ని తీసుకుంటే.. మిగిలిన రూ.2 లక్షలను ప్రభుత్వం ఎప్పుడు మాఫీ చేస్తుందో స్పష్టత లేనప్పుడు ఇప్పుడే తొందరపడటం ఎందుకనే అభిప్రాయంతో బ్యాంకర్లు ఉన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సర్క్యులర్ వచ్చిన తర్వాతే చూద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఉదాహరణకు.. ఒక రైతుకు రూ.2.50 లక్షల అప్పుంటే ఆ రైతు రూ.50 వేలు చెల్లిస్తే బ్యాంకర్లు జమ చేసుకోవాలి. మిగిలిన రూ.2 లక్షలు ప్రభుత్వం మాఫీచేయాలి. కానీ, ఈ ప్రక్రియ రాష్ట్రంలో ఎక్కడా ఇంతవరకు మొదలుకాలేదు.
మాఫీపై రైతుల్లో ఆందోళన..
రూ.2 లక్షలకు మించి రుణం మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు రైతులకు ప్రభుత్వం రూ.2 లక్షలు మాఫీ చేసిందని, మాకెందుకు మాఫీ చేయరంటూ.. వ్యవసాయశాఖ అధికారులతో, బ్యాంకర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. కొన్నిచోట్ల జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వీరి రుణాలను ఎప్పుడు మాఫీ చేయాలి? కటాఫ్ తేదీ ఎప్పుడు పెట్టాలి? ఎంత సమయం ఇవ్వాలి? అనే అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్నవారి కేటగిరీలో మాఫీ కోసం రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.
అయితే ఈ పథకానికి పీఎం- కిసాన్ నిబంధనల్ని అమలు చేస్తుండటంతో.. రైతుల సంఖ్య, రుణమాఫీ మొత్తం గణనీయంగా తగ్గుతోంది. మొత్తంగా ఇది నాలుగైదు వేల కోట్లకు తగ్గుతుందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఈ మొత్తం నిధులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కానీ, రూ.2 లక్షల లోపు రుణం ఉన్న ఖాతాలే ఇంకా కొన్ని క్లియర్ కాలేదు. పలు కారణాల వల్ల తిరస్కరణకు గురైన ఈ ఖాతాల కోసం కొంత బడ్జెట్‌ను కేటాయించాల్సి ఉంది. మొత్తం రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం చెప్పే రూ.31 వేల కోట్ల లెక్క ప్రకారం చూస్తే.. ఈ పథకం పూర్తిచేయడానికి ఇంకా రూ.13 వేల కోట్లు కావాలి. బడ్జెట్‌లో పెట్టిన రూ.26 వేల కోట్ల లెక్క ప్రకారమైతే.. ఇంకా రూ.8 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో నిధుల లభ్యత చూసుకొని, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.