Palamuru: వట్టెం పంప్‌హౌస్ విద్యుత్తు కనెక్షన్‌కు 62 కోట్లు
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:20 AM
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌ్‌సలో చేరిన వరద నీటిని తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది.
విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం
పంప్‌హౌ్‌సలో వరద నీటిని తొలగించే కసరత్తు ముమ్మరం
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌ్‌సలో చేరిన వరద నీటిని తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందుకు నెల రోజులకు పైగా పట్టనుందని అధికారులు అంచనా వేశారు. పంప్‌హౌస్, టన్నెళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు తొలుత 16 పంపులను ఏర్పాటు చేయాలని భావించారు. తాజాగా పంప్‌హౌస్, డ్రాఫ్ట్ ట్యూబుల్లోకి చేరిన దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల వరద నీటిని అదనపు మోటార్ల ద్వారా తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఆ తర్వాత ప్రాజెక్టులోని పంపులను సిద్ధం చేసి, వాటి ద్వారానే టన్నెల్‌లోని దాదాపు 26 లక్షల క్యూబిక్ మీటర్ల వరద నీటిని తొలగించవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. అయితే పంప్‌హౌ్‌సకు విద్యుత్తు కనెక్షన్ లేదు. దానికోసం రూ.62 కోట్లను దక్షిణ డిస్కమ్‌కు చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తుచేయగా.. అవసరమైన నిధులు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం శివారులోని నాగనూలు చెరువు ఉప్పొంగడంతో ఆ నీరంతా వట్టెం పంప్‌హౌ్‌సను ముంచెత్తింది. వట్టెం రిజర్వాయర్‌కు నీటిని తరలించే కట్టకు గండిపడి టన్నెల్‌లోకి భారీగా నీరు చేరింది. అదేవిధంగా కుమ్మెర గ్రామ సమీపంలోని చెరువు వరద కూడా టన్నెల్‌లోకి వెళ్లింది. 16 కిలోమీటర్ల పొడవైన 2 సొరంగాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి.