Share News

భూ అక్రమాలపైనా సిట్‌!

ABN , Publish Date - Dec 20 , 2024 | 04:33 AM

ప్రభుత్వం భూభారతిని అమలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గత పదేళ్ల కాలంలో జరిగిన భూ అవకతవకలు, ఆక్రమణలపై సమగ్ర విచారణ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

భూ అక్రమాలపైనా సిట్‌!

  • పదేళ్లలో జరిగిన లావాదేవీలపై

  • సమగ్ర విచారణకు సర్కారు యోచన ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం భూభారతిని అమలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గత పదేళ్ల కాలంలో జరిగిన భూ అవకతవకలు, ఆక్రమణలపై సమగ్ర విచారణ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక 2014 నుంచి 2023 వరకు జరిగిన భూ లావాదేవీల్లో ప్రభుత్వ భూముల దుర్వినియోగంపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా కూడా భూముల అన్యాక్రాంతంపై చర్చ జరిగింది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సుమారు 25 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైనట్లు తెలిపారు. ఒక్క ఇబ్రహీంపట్నం పరిధిలోనే 10 వేల ఎకరాలు అన్యాక్రాంతం చేశారని, అక్కడ ఎకరా రూ.10 కోట్ల విలువ ఉంటుందన్నారు. అన్యాక్రాంతమైన 25 వేల ఎకరాల భూముల మొత్తం విలువ రూ.2.50 లక్షల కోట్లు అని, ఈమేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందన్నారు. ధరణి మసుగులో జరిగిన భూ ఆక్రమనలన్నీ బయట పెడతామని, దీని వెనకాల ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తేలేదని ఇప్పటికే పలు సందర్భాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో గత పదేళ్లలో చోటు చేసుకున్న భూ ఆక్రమణల మీద సమగ్ర విచారణ చేయడానికి సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.


బినామీల పేరుతో చేతులు మారాయి

ఇటీవల ధరణి కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పార్ట్‌-బీలో పెట్టిన భూముల గురించి ప్రస్తావించింది. అందులో వివిధ కారణాలతో 13.38 లక్షల ఎకరాలు, అసలు ఏ కారణం లేకుండా 5.07 లక్షల ఎకరాలను పెండింగ్‌లో పెట్టారని పేర్కొన్నారు. ఈ భూముల్లో ధరణి అమల్లోకి వచ్చాక 2020 నుంచి గత నాలుగేళ్లలో ఎన్ని లావాదేవీలు జరిగాయి, ఎన్ని వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి అనే అంశాలపైనా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల నుంచి ఇది వరకే నివేదికలు తెప్పించింది. బినామీల పేరుతో పెద్దఎత్తున భూములు చేతులు మారినట్లు గుర్తించిన ప్రభుత్వం అందుకు కారకులైన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది.


పార్ట్‌-బీలో పెట్టిన భూముల్లో భూదాన్‌కు సంబంధించి 2,957 ఎకరాలు, వక్ఫ్‌ బోర్డుకు సంబంధించి 9672 ఎకరాలు, దేవాదాయ భూములు 15994 ఎకరాలు, అటవీ భూములు 34,612 ఎకరాలు, అటవీ, రెవెన్యూ సరిహద్దు వివాదానికి సంబంధించినవి 21,673 ఎకరాలు, ప్రభుత్వ భూములు అన్న అనుమానంతో 93,308, అనధికారిక ఆక్రమణలు (శివాయ్‌ జామీదార్‌) 16879 ఎకరాలు, సివిల్‌ కోర్టు వివాదాల్లో 34,755 ఎకరాలు, పీవోటీ కేసులకు సంబంధించి 78,543 ఎకరాలు, అసలు ఏ కారణం లేని భూములు 507,091 ఎకరాలు ఉన్నట్లు చూపారు. ఇవే కాకుండా ఇతరత్రా కారణాలతో కూడా వేలాది ఎకరాలను పార్ట్‌-బీలో పెట్టారు. రంగారెడ్డి, మెదక్‌, హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలోనే అత్యధికంగా భూ ఆక్రమణలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈడీ విచారణలోనూ రంగారెడ్డి జిల్లా నాగారంలో 50 ఎకరాల భూదాన్‌ భూములు చేతులు మారినట్లు తేలింది. అలాగే జీవో 59ను అడ్డు పెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సిట్‌ విచారణ ద్వారా ఆక్రమణల గుట్టురట్టు చేయాలని ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Updated Date - Dec 20 , 2024 | 04:33 AM