Share News

Musi River: మూసీని ఇలా బాగు చేస్తాం..

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:42 AM

ఆక్రమణల తొలగింపుపై క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రజారోగ్యం, హైదరాబాద్‌ పర్యాటక, వాణిజ్య అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మూసీ ప్రక్షాళనలో ముందుకేసాగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Musi River: మూసీని ఇలా బాగు చేస్తాం..

  • దక్షిణ కొరియాలోని సియోల్‌లో అధ్యయనం

  • 19 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన

  • ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో నిర్ణయం..

  • బీఆర్‌ఎస్‌, ఎంఐఎం శాసనసభ్యులు దూరం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఆక్రమణల తొలగింపుపై క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రజారోగ్యం, హైదరాబాద్‌ పర్యాటక, వాణిజ్య అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మూసీ ప్రక్షాళనలో ముందుకేసాగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీ చేసిన నివాసాల కూల్చివేత చేపట్టిన ప్రభుత్వ విభాగాలు.. మార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశాయి. నిర్వాసితులను ఒప్పించాకే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఉన్నతస్థాయి ఆదేశాల నేపథ్యంలో వేచి చూస్తున్నాయి. ప్రాజెక్టులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తొలినుంచి యోచిస్తున్న సర్కారు వారిని దక్షిణ కొరియా తీసుకెళ్లాలని నిర్ణయించింది.


సుందరకీరణ తర్వాత నది రూపు ఎలా మారనుందో అవగాహన కల్పించేందుకు అధ్యయనానికి తీసుకెళ్లనుంది. 21 మందితో కూడిన బృందం పర్యటనకు ఇటీవల సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఉన్నతాధికారులతో కూడిన బృందం దక్షిణ కొరియా వెళ్లనుంది. అక్కడి చాంగి చియోన్‌లో హన్‌ నది, సియోల్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 25వ తేదీన తిరిగి రానుంది. గతంలో నది, తీరం ఎలా ఉండేది? తర్వాత ఎలా మారాయో ప్రజాప్రతినిఽధులకు చూపించనున్నట్టు ఓ అధికారి తెలిపారు.


  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దూరం

బాపూ ఘాట్‌ నుంచి ఫీర్జాదిగూడ వరకు మూసీ ప్రవహించే నియోజకవర్గాలకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలను దక్షిణ కొరియాకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పర్యటనకు వెళ్లేందుకు మొదట బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆసక్తి చూపారు. ఇటీవలి పరిణామాలు, స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో వారు వెళ్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మూసీ అభివృద్ధిని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న బీఆర్‌ఎస్‌.. పలు ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి స్థానికులకు అండగా ఉంటామని ప్రకటించింది. అలాంటపుడు పార్టీ ఎమ్మెల్యేలు దక్షిణ కొరియా వెళితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నట్టు తెలిసింది. బుధవారం తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశం కానున్నారు. మూసీ అంశం ప్రధానంగా చర్చించనున్న ఈ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని ఓ ఎమ్మెల్యే తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యేలూ పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. అయితే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా పర్యటనకు వెళ్లవద్దని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.


  • దక్షిణ కొరియా వెళ్లే జాబితా ఇదే..

మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, చామకూర మల్లారెడ్డి (బీఆర్‌ఎస్‌), మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్‌ (కాంగ్రెస్‌), రాజాసింగ్‌ (బీజేపీ), మహ్మద్‌ ముబిన్‌, కౌసర్‌ మొహినుద్దీన్‌, మీర్‌ జుల్ఫీకర్‌ అలీ, అహ్మద్‌ బిన్‌ బలాల (ఎంఐఎం). పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌, ఎంఆర్‌డీసీఎల్‌ జాయింట్‌ మెనేజింగ్‌ డైరెక్టర్‌ పూజారి గౌతమి,ఎంఆర్‌డీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సోలిపేట శ్రీనివా్‌సరెడ్డి, ఎంఆర్‌డీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ దత్తు పంతు, ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌ ఎంవీ వెంకటశేఖర్‌.

Updated Date - Oct 17 , 2024 | 03:42 AM