Share News

High Court: ‘ప్రత్యేక కమిషన్‌’పై సర్కారు అభ్యంతరం!

ABN , Publish Date - Nov 02 , 2024 | 04:47 AM

రాష్ట్రంలో కులగణన, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రత్యేక కమిషన్‌ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు తీర్పుపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

High Court: ‘ప్రత్యేక కమిషన్‌’పై సర్కారు అభ్యంతరం!

  • హైకోర్టులో కౌంటర్‌ దాఖలుకు నిర్ణయం

  • కులగణనకు ప్రత్యేక కమిషన్‌ ఉండాలంటూ కృష్ణయ్య పిటిషన్‌.. పరిశీలించాలన్న హైకోర్టు

  • అడ్వకేట్‌ జనరల్‌తో చర్చిస్తున్న అధికార వర్గాలు

హైదరాబాద్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కులగణన, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రత్యేక కమిషన్‌ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు తీర్పుపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ నెల 21లోపు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కౌంటర్‌ ఎలా దాఖలు చేయాలన్న అంశంపై అడ్వకేట్‌ జనరల్‌తో ప్రభుత్వ వర్గాలు.. చర్చిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలంటే కులగణన చేయాల్సి ఉంది.


ఈ క్రమంలోనే బీసీ కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం.. కులగణనకు కూడా ఇదే కమిషన్‌ డెడికేటెడ్‌ కమిషన్‌గా ఉంటుందని జీవో 199లో పేర్కొంది. అయితే, ఈ అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కులగణనకు డెడికేటెడ్‌ కమిషన్‌గా బీసీ కమిషన్‌నే గుర్తించడం సమంజసం కాదని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు పరిచేందుకు కొత్త డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించానలి హైకోర్టు పేర్కొనగా.. దీనిపై తన వాదనను వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Updated Date - Nov 02 , 2024 | 04:47 AM