Financial Release: రెండో విడత మాఫీకి 7 వేల కోట్లు!
ABN , Publish Date - Jul 21 , 2024 | 03:11 AM
తొలి విడత రుణమాఫీ నిధులను ఈనెల 18 తేదీన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... రెండో విడత నిధులను ఈనెల 31వ తేదీన విడుదలచేసే అవకాశాలున్నాయి. రూ.లక్ష వరకు అప్పున్న రైతులకు రూ. 6,099 కోట్లు విడుదలచేయగా లక్షన్నర వరకున్న అప్పులు మాఫీచేయటానికి మరో రూ.7 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి.
ఈనెల 31న నిధులు విడుదలచేసే అవకాశం
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తొలి విడత రుణమాఫీ నిధులను ఈనెల 18 తేదీన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... రెండో విడత నిధులను ఈనెల 31వ తేదీన విడుదలచేసే అవకాశాలున్నాయి. రూ.లక్ష వరకు అప్పున్న రైతులకు రూ. 6,099 కోట్లు విడుదలచేయగా లక్షన్నర వరకున్న అప్పులు మాఫీచేయటానికి మరో రూ.7 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. రెండు లక్షల రుణమాఫీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీని గడువుగా పెట్టుకున్న విషయం విదితమే! ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రుణమాఫీ కోసం సేకరించిన నిధులు మరో రూ. 4 వేల కోట్లు ఉన్నాయి. అంటే రెండో విడత అవసరాల కోసం రూ. 3 వేల కోట్లు సమకూర్చాల్సి ఉంది.
ఇందుకుగాను ఆర్బీఐ నుంచి రూ. 3 వేల కోట్లు అప్పు తీసుకోవటానికి సర్కారు ఇండెంటు పెట్టింది. ఈ మొత్తం ఈనెల 23న ఆర్బీఐ నుంచి రాష్ట్ర ఖజానాకు రానుంది. మూడో విడతకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. రూ.2లక్షల కేటగిరీలో ఉండే రైతులకు రుణమాఫీ చేయటానికి సుమారు రూ. 18 వేల కోట్ల నిధులు అవసరమవుతాయనే అంచనాలున్నాయి. ఆగస్టులో వీటి పూలింగ్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టే అవకాశాలున్నాయి. కాగా ఈనెల 23 తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 25వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత రెండో విడత రుణమాఫీ పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.