Share News

T-Fiber Project: ఇంటింటికి ఇంటర్నెట్‌! రూ.300 లకే..

ABN , Publish Date - Aug 24 , 2024 | 02:50 AM

టీ-ఫైబర్‌ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు రూ.300కే ఫైబర్‌ కనెక్షన్‌ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

T-Fiber Project: ఇంటింటికి ఇంటర్నెట్‌! రూ.300 లకే..

  • 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం

  • అందులోనే కేబుల్‌ టీవీ, పిల్లలకు బడి పాఠాలు

  • ఈ పథకానికి వడ్డీ లేకుండా రూ.1779 కోట్లు ఇవ్వండి

  • కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

  • క్రీడా వర్సిటీకి ఆర్థిక సాయం చేయండి

  • మాండవీయను కోరిన సీఎం

న్యూఢిల్లీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): టీ-ఫైబర్‌ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు రూ.300కే ఫైబర్‌ కనెక్షన్‌ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు రూ. 300కే ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ, ఈ-ఎడ్యుకేషన్‌ సేవలు అందిస్తామని చెప్పారు. టీ-ఫైబర్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్టివిటీని కల్పించడం తమ లక్ష్యమన్నారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కేంద్ర మంత్రి సింధియాతో భేటీ అయ్యారు. రూ.1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ-ఫైబర్‌ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని వివరించారు.


మొత్తం పెట్టుబడి వ్యయం రూ.1,779 కోట్లను యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎ్‌సఎ్‌ఫఓ) ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్‌ ద్వారా 65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్‌ టూ గవర్నమెంట్‌), జీ2సీ (గవర్నమెంట్‌ టూ సిటీజన్‌) కనెక్టివిటీ కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 300 రైతు వేదికలకు టీ-ఫైబర్‌ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని, సాంఘిక సంక్షేమ పాఠశాలలకూ టీ-ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌ (ఎన్‌ఓఎ్‌ఫఎన్‌) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం రేవంత్‌ కోరారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎన్‌ఓఎ్‌ఫఎన్‌ మొదటి దశ లీనియర్‌ ఆర్కిటెక్చర్‌ ఆధారంగా నడుస్తుంటే... మిగతా ప్రాంతాల్లో రింగ్‌ ఆర్కిటెక్చర్‌ ఆధారంగా టీ-ఫైబర్‌ నడుస్తోందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. నెట్‌ వర్క్‌ సమర్థ నిర్వహణ, వినియోగం కోసం సకాలంలో ఎన్‌ఓఎ్‌ఫఎన్‌ మొదటి దశ మౌలిక సదుపాయాలను అందించాలని ప్రతిపాదించారు.


ఎన్‌ఓఎ్‌ఫఎన్‌ మొదటి దశను భారత్‌ నెట్‌-3 ఆర్కిటెక్చర్‌కు మార్చడానికి గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన డీపీఆర్‌ను త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌ నెట్‌-3 ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రజలకు ఈ-గవర్నెన్స్‌ను అందించవచ్చని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయాల కల్పనకు ఉద్థేశించిన భారత్‌ నెట్‌ ఉద్యమి పథకాన్ని టీ-ఫైబర్‌కు వర్తింపజేయాలని సింధియాను సీఎం కోరారు.


  • క్రీడా వర్సిటీపై మన్‌సుఖ్‌ మాండవీయతో

తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీేసందుకు క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర క్రీడామంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌ మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రీడా విశ్వవిద్యాలయంలో అన్ని రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. విశ్వవిద్యాలయానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులన్నీ తెలంగాణలో ఉన్నాయని, భవిష్యత్తులో నిర్వహించనున్న ఒలింపిక్స్‌తో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశాన్ని తెలంగాణకు ఇవ్వాలని కోరారు.


మంత్రి మాండవీయను సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు కలిశారు. క్రీడా శాఖకు సంబంధించి తమ లక్ష్యాలను, ఆకాంక్షలు, తెలంగాణకు ఉన్న ఘనతను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారులు రాణించడానికి అవసరమైన అన్ని వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, సరూర్‌ నగర్‌ స్టేడియం, ఎల్బీ ేస్టడియం, కేవీబీఆర్‌ ఇండోర్‌ ేస్టడియం, ఓయూ క్యాంపస్‌, జింఖానా గ్రౌండ్‌, హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొలనులు, మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలు, సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్స్‌, షూటింగ్‌ రేంజ్‌, ఫుట్‌బాల్‌ గ్రౌండ్స్‌, ేస్కటింగ్‌ ట్రాక్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, ఇతర క్రీడలకు వసతులు ఉన్నాయని కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.


హైదరాబాద్‌లో వివిధ కేటగీరిల ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు ఉన్నాయని, విమాన, రైలు సర్వీసులతో అనుసంధానమై ఉందని తెలిపారు. 2002లో నేషనల్‌ గేమ్స్‌, 2003లో ఆఫ్రో-ఏషియన్‌ గేమ్స్‌, 2007లో ప్రపంచ మిలటరీ గేమ్స్‌ నిర్వహించిన అనుభవం హైదరాబాద్‌కు ఉందని గుర్తు చేశారు. ఒలింపిక్స్‌, ఏషియన్‌ గేమ్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించే అవకాశం భారత్‌కు వచ్చినపుడు తెలంగాణకు కూడా అవకాశం ఇప్పించాలని కోరారు. 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయకు విజ్ఞప్తి చేశారు.


రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్థికి ఖేలో ఇండియా పథకం కింద నిధులు విడుదలను పెంచాలని కోరారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్ట్టేడియం, సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లోని షూటింగ్‌ రేంజ్‌, ఎల్‌బీ ేస్టడియం, హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్‌, సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియాలలో మౌలిక వసతుల అభివృద్థికి తాము ఇప్పటికే పంపించిన డీపీఆర్‌లను ఆమోదించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 02:50 AM