Share News

Forensic Audit: అక్రమాలను శాస్త్రీయంగా నిగ్గుతేల్చేందుకే ఫోరెన్సిక్‌ ఆడిట్‌

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:57 AM

ఇవే కాదు.. భూ లావాదేవీలకు సంబంధించి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చాక చిత్ర విచిత్రాలు చాలా జరిగాయి. ధరణిని వాడుకుని చాలా మంది వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాహా చేశారనే ఫిర్యాదులున్నాయి.

Forensic Audit: అక్రమాలను శాస్త్రీయంగా  నిగ్గుతేల్చేందుకే ఫోరెన్సిక్‌ ఆడిట్‌

సంగారెడ్డిలో ఓ వ్యక్తి చనిపోయాడు. అతని ఆస్తి తన భార్యకు చెందాలి. కానీ ఓ తహసీల్దార్‌ సదరు వ్యక్తి పేరిట ఉన్న 27 ఎకరాల భూమిని సంబంధం లేని వ్యక్తులకు ధరణి ద్వారా బదలాయించారు.

పెద్దపల్లిలో 695 ఎకరాల భూమి ఒకే వ్యక్తి పేరుపై ధరణిలో నమోదు చేసి పాస్‌పుస్తకాలు ఇచ్చారు. వాటిని చూసి ఆ వ్యక్తి కూడా నివ్వెరపోయాడు.

  • ఒక్కో సర్వే నంబర్‌ డిజిటల్‌ రికార్డుల పరిశీలనతో దర్యాప్తు

  • ధరణి వచ్చాక జరిగిన లావాదేవీలపై దృష్టి

  • రెవెన్యూ, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వారితో దర్యాప్తు కమిటీ

  • అవకతవకలన్నీ బయటపడే అవకాశం

ఇవే కాదు.. భూ లావాదేవీలకు సంబంధించి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చాక చిత్ర విచిత్రాలు చాలా జరిగాయి. ధరణిని వాడుకుని చాలా మంది వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాహా చేశారనే ఫిర్యాదులున్నాయి. అయితే, అసలు ఈ అవకతవకలు ఎలా జరిగాయి? వీటి వెనక ఉన్న పాత్రదారులు ఎవరు? ధరణి అమలులోకి వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమాలు ఇంకెన్ని జరిగాయి? తదితర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పదేళ్లలో ముఖ్యంగా ధరణి ఏర్పాటు చేశాక 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాలని నిర్ణయించింది. అయితే, భూరికార్డుల ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అంటే ఏంటి? ఎలా చేస్తారు? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తాయి.


ఫొరెన్సిక్‌ ఆడిట్‌ ఎలా చేస్తారంటే ...

ఏదైనా హత్య జరిగినప్పుడు ఫోరెన్సిక్‌ నిపుణులు ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించారనే మాట వింటుంటాం. ఫోరెన్సిక్‌ నిపుణులు తాము సేకరించిన ఆధారాలను శాస్ర్తీయంగా పరిశీలించి హత్య జరిగిన తీరు, కారణాలు వంటి అనేక అంశాలు అంచనా వేస్తారు. అదే భూరికార్డుల విషయానికి వచ్చే సరికి... ఏదైనా ఓ సర్వే నెంబరు సంబంధించిన డిజిటల్‌ రికార్డులను పూర్తిస్థాయిలో బయటికి తీసి పరిశీలించి అక్రమాలను గుర్తిస్తారు. డిజిటల్‌ ఆనవాళ్లను పూర్తి స్థాయిలో వెలికి తీయడం ద్వారా ఆ సర్వే నంబరు మీద జరిగిన లావాదేవీలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందని పబ్లిక్‌ పాలసీ నిపుణులు దొంతి నరసింహారెడ్డి అన్నారు. డేటా ఎప్పుడు ఎంట్రీ చేశారు? ఎవరు లాగిన్‌ అయ్యారు? ఎక్కడి నుంచి లాగిన్‌ అయ్యారు? ఎవరి ఆదేశాలతో పని చేశారు? ఎవరి పేరు మీద భూమి బదిలీ అయింది? ఇలాంటి అనేక అంశాలు డిజిటల్‌ రికార్డుల ద్వారా తెలుసుకునే అవకాశముందని ఆయన చెప్పారు. ఇదే విషయంపై రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ జరిగిన అక్రమాలను శాస్ర్తీయంగా నిగ్గుతేల్చడమే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అని అన్నారు. ప్రతి సర్వే నంబరుపై జరిగిన లావాదేవీలమీద పోస్టుమార్టం చేస్తే తెరవెనుక జరిగిన వ్యవహారాలన్నీ వెలుగు చూస్తాయన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, రెవెన్యూ అంశాల్లో పట్టు ఉన్న వారిని నియమించి ఆడిట్‌ చేయిస్తే సత్ఫలితాలు వస్తాయని సదరు అధికారి సూచించారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులివ్వనుంది.


ధరణి పోర్టల్‌ నిర్వహణ ఏజెన్సీపై సీఎంకు లేఖ

ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అంశాన్ని పబ్లిక్‌ పాలసీ నిపుణులు దొంతి నరసింహారెడ్డి కొద్ది నెలల క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. భూ రికార్డుల నిర్వహణకు ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఐఎల్‌ఎ్‌ఫ(టెరాసిస్‌), తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ మధ్య జరిగిన ఒప్పందం విషయంలో పలు సందేహాలను ఎత్తిచూపుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన ఏప్రిల్‌ 18న లేఖ రాశారు. ఆ ఒప్పందంలోని అనేక అంశాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా అనధికారిక భూ కేటాయింపులు, రికార్డుల దుర్వినియోగాన్ని నిలువరించేందుకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, కానీ ఆ టెక్నాలజీ వినియోగించిన దాఖలాలపై విచారణ చేయాలని కోరారు. 2022 సెప్టెంబరులో సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం తహసీల్దార్‌ రాజయ్య.. నాగనపల్లి గ్రామానికి చెందిన శివమ్మకు చెందిన 27.3ఎకరాలను అంజమ్మ అనే మరొకరి పేరు మీద మార్చారు. ధరణి పోర్టల్‌లో రికార్డులు మార్చే అధికారం తహసీల్దార్‌కు లేకున్నా ఆ పని చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు.


22ఏ భూముల గుట్టు కూడా బయటికి ?

ఇటీవల అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ సుమారు 25 వేల ఎకరాలు చేతులు మారాయని, 2014కి ముందు 22ఏ కింద ఉన్న భూములు 2014 నుంచి 2023 మధ్యలో జాబితా నుంచి తొలగించిన భూముల లెక్కలు కూడా తీస్తున్నామని చెప్పారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేపడితే ఆయా భూలావాదేవీల వెనక ఉన్న గుట్టు బయటపడే అవకాశం ఉంది.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

Updated Date - Dec 22 , 2024 | 04:57 AM