Share News

Doctor Recruitment: 2400 సర్కారీ డాక్టర్‌ కొలువులు

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:36 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించింది.

Doctor Recruitment: 2400 సర్కారీ డాక్టర్‌ కొలువులు

  • భర్తీకి 45 రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం

  • 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పది రోజుల్లో ప్రకటన

  • మెడికల్‌ బోర్డు కసరత్తు

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించింది. కొద్ది నెలల క్రితం 435 మంది వైద్యుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన ప్రభుత్వం త్వరలో మరో 2,400 మంది వైద్యులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ 45 రోజుల్లో వెలువడే అవకాశముంది. మరోపక్క, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 612 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పది రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. దసరాలోపే ఈ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. అలాగే, వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 1600 మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్టు) పోస్టుల భర్తీకీ రంగం సిద్ధమవుతోంది.


ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తర్వాత ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుంది. దీంతో పాటు ఈఎ్‌సఐ డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న 200కు పైగా వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు కూడా ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉంది. కాగా, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 435 వైద్యుల పోస్టుల భర్తీకి జూన్‌ 28న మొదలైన ప్రక్రియ తుది దశకు చేరింది. సంబంధిత మెరిట్‌ జాబితా, సెలక్షన్‌ లిస్ట్‌ దసరా లోపే విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈఎ్‌సఐ డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న 200 డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే ఆ పోస్టులను ఇప్పటికే ఇచ్చిన 435 వైద్య పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో కలిపివేయనున్నారు. మొత్తం 635 పోస్టులను చూపించి మెరిట్‌ ఆధారంగా జాబితాను విడుదల చేయనున్నారు.


  • 15 రోజుల్లో 3967 పోస్టులకు నోటిఫికేషన్‌

మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు గత 15 రోజుల్లో 3,967 వేర్వేరు పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులో 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు, 2.050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు, 633 ఫార్మసిస్టు కొలువులు ఉన్నాయి. ఇవికాక, 1,666 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫీమేల్‌), 156 ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌, 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, 24 ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇప్పటికే 643 మంది టీచింగ్‌ ఫ్యాకల్టీని కాంట్రాక్టు పద్ధతిలో ఇటీవలే తీసుకున్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు సంబంధించిన 7,308 వేర్వేరు పోస్టులు భర్తీ అయ్యాయి.

Updated Date - Sep 26 , 2024 | 03:36 AM