Share News

ROR Act: ధరణి ఇక భూమాత

ABN , Publish Date - Dec 16 , 2024 | 03:20 AM

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలని నిర్ణయించిన ఆర్‌వోఆర్‌ చట్టానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గురు, లేదా శుక్రవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ROR Act: ధరణి ఇక భూమాత

  • కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం ముసాయిదా సిద్ధం

  • గురు, శుక్రవారాల్లో అసెంబ్లీలో సవరణ బిల్లు!

  • నేడు క్యాబినెట్‌ భేటీలో ఆమోదించే అవకాశం

  • ధరణిలోని పలు అంశాల్లో మార్పులు చేర్పులు

  • భూ సమస్యలన్నింటినీ తీర్చేలా కొత్త చట్టం

  • ఏ మాడ్యూల్‌లో దరఖాస్తు చేసినా పరిష్కారం

  • రైతులు అప్పీలుకు వెళ్లేందుకు ట్రైబ్యునళ్లు

  • గ్రామకంఠం భూములకూ విలువ.. రుణాలూ

  • సాదా బైనామా భూములకూ పరిష్కారం

  • ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలని నిర్ణయించిన ఆర్‌వోఆర్‌ చట్టానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గురు, లేదా శుక్రవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టంలో భాగంగా ధరణి స్థానంలో ‘భూమాత’ను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం, అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుపై ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణిలోని లోపాలను సవరిస్తూ.. కొత్త ఆర్‌వోఆర్‌ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేశారు. సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత గవర్నర్‌ ఆమోదం కోసం పంపించనున్నారు.


గవర్నర్‌ ఆమోదం అనంతరం కొత్త చట్టం అమల్లోకి రానుంది. కాగా, కొత్త ఆర్‌వోఆర్‌ చట్టంలో భాగంగా ప్రస్తుతం ధరణిలో ఉన్న అనేక అంశాల్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. ప్రజలకు మరింత మేలు జరిగేలా దీనిని రూపొందిస్తున్నారు. రైతులకు తమ భూములకు సంబంధించి ఉన్న చాలా సమస్యలకు ప్రస్తుతం ధరణిలో పరిష్కారం లభించడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భూములకు సంబంఽధించిన అన్ని సమస్యలను పరిష్కరించేలా ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ధరణిలో 33 మాడ్యూల్స్‌ ఉన్నాయి. ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే.. దరఖాస్తు సమయంలో సమస్య ఒకటై ఉండి, మాడ్యూల్‌లో మరో దానిని ఎంపిక చేస్తే.. ఆ దరఖాస్తునే తిరస్కరిస్తున్నారు. దీంతో కొత్త చట్టంలో ఏ మాడ్యూల్‌లో దరఖాస్తు చేసినా సమస్యను పరిష్కరించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారిదే బాధ్యతగా నిర్ణయించబోతున్నారు. భూ సమస్యల పరిష్కారానికి సింగిల్‌ విండో వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ధరణిలో సమస్య పరిష్కారం కాకపోతే.. సదరు రైతు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.


ఇలాంటి రైతులు కోర్టులకు వెళ్లాల్సి ఉంది. అయితే.. కోర్టుకు వెళితే సమస్య పరిష్కారం కావడానికి అనేక ఏళ్లు పడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త చట్టంలో భాగంగా భూమాతలో పరిష్కారం కాని సమస్యపై అప్పీలుకు వెళ్లడానికి వీలుగా ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికారుల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే.. ఈ ట్రైబ్యునళ్లను ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎటువంటి డాక్యుమెంట్లు లేని గ్రామకంఠం వంటి భూములకు విలువ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి భూములను రిజిస్ర్టేషన్‌ చేసేలా, వాటికి బ్యాంకు రుణాల ఇచ్చేలా కొత్త చట్టంలో రూపకల్పన చేస్తున్నారు. దీంతోపాటు సాదా బైనామా భూములకు కూడా పరిష్కారం చూపే విధంగా కొత్త చట్టంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వీఆర్‌వో వ్యవస్థను కూడా అమలు పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారిని ఎలా ఉపయోగించుకోవాలనేఅంశంపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత విధి విధానాలు రూపొందించే అవకాశం ఉంది.


నేడు మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ఆర్‌వోఆర్‌ చట్ట సవరణ బిల్లును క్యాబినెట్‌ ఆమోదించే అవకాశం ఉంది. అలాగే.. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును, యూనివర్సిటీల బిల్లును కూడా ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు వీఆర్‌వోల వ్యవస్థ, జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్‌ విచారణ అంశాలపై చ ర్చించే అవకాశం ఉంది.


ఉక్కుమనిషి పటేల్‌కు ముఖ్యమంత్రి నివాళి

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. అనంతరం మంత్రి కొండా సురేఖ దంపతులు సీఎంతో చర్చలు జరిపారు. కాంగ్రె్‌సలో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయించాల్సిందిగా వారు కోరినట్లు తెలిసింది. వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్నా.. ముందస్తుగానే సీఎంను కలిసి సీటును కోరడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవో వెంకయ్య చౌదరి సీఎం రేవంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు.


నేడు అసెంబ్లీలో సంతాపాలు, టూరిజం పాలసీపై చర్చ

  • అజెండా ఖరారుపై బీఏసీ భేటీ

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం పది గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. తొలుత మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతీదేవి, ఊకె అబ్బయ్య, డి.రాంచంద్రరెడ్డిల మరణం పట్ల శాసనసభ సంతాపాన్ని ప్రకటించనుంది. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం చేపట్టనున్నారు. అవి ముగిసిన తర్వాత తెలంగాణ టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది. అనంతరం తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య, క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును, తెలంగాణ విశ్వ విద్యాలయాల సవరణ బిల్లులను సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రతిపాదించనున్నారు. ఇటు.. శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డికి సంతాపం తెలిపి.. అనంతరం తెలంగాణ టూరిజం పాలసీపై స్పల్పకాలిక చర్చ చేపడతారు. ఇక అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ చేపట్టాలి.. తదితర అంశాలకు సంబంధించి అజెండాను ఖరారు చేసేందుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన బీఏసీ కూడా సోమవారం భేటీ కానుంది. శీతాకాల సమావేశాలు ఐదు నుంచి ఏడు పనిదినాల పాటు కొనసాగే అవకాశమున్నట్లు అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Dec 16 , 2024 | 03:20 AM