Free Electricity: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు
ABN , Publish Date - Sep 06 , 2024 | 05:02 AM
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
స్కూల్ నుంచి వర్సిటీ దాకా.. విభాగాధిపతులకు
నెలనెలా కరెంటు బిల్లులు
దీనికోసం ప్రత్యేకంగా పోర్టల్
ఆర్థిక శాఖతో అనుసంధానం
ప్రతి నెలా బడ్జెట్ కేటాయింపు
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, ఐటీఐలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పూర్తి ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయనుంది. రాష్ట్రంలో 30,200 ప్రభుత్వ పాఠశాలలు, 450 ప్రభుత్వ జూనియర్ కాళాశాలలు, 268 ఎస్సీ గురుకులాలు, 183 ఎస్టీ గురుకులాలు, 265 బీసీ గురుకులాలు, 204 మైనారిటీ గురుకులాలు, 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి.
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తును అందించాలన్న ప్రతిపాదన గత జూన్‌లో రాగా గురువారం ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సరఫరా కోసం డిస్కమ్‌లు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించనున్నాయి. ఈ పోర్టల్‌లో విద్యా సంస్థలు ఏ విభాగాధిపతి పరిధిలోకొస్తే ఆ విభాగాధిపతి ఆ పోర్టల్‌లోకి లాగిన్ అయి.. తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల వివరాలను వెబ్ పోర్టల్‌లో చేర్చాలి. విద్యాసంస్థల జాబితాను ఆయా శాఖల కార్యదర్శులు పోర్టల్‌లో ఆమోదించాలి.
విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేసినా, ప్రతినెలా క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి సంబంధిత అధికారికి కరెంట్ బిల్లులు అందిస్తారు. ఆయా విద్యాసంస్థలు ఏ మేరకు కరెంట్‌ను వినియోగించాయి? వినియోగానికి సంబంధించిన సమగ్ర వివరాలు, చెల్లింపులు, బకాయిలు.. విద్యాసంస్థలు, మండలాలు, జిల్లాల వారీగా సంబంధిత శాఖలకు అందుబాటులో ఉంటాయి. డిస్కమ్‌లు తయారుచేసే పోర్టల్‌ను ఆర్థిక శాఖతో అనుసంధానం చేస్తారు. ఆర్థిక శాఖ ప్రతినెలా కేటాయింపులు చేస్తూ బడ్జెట్ విడుదల చేయనుంది. ఉచిత విద్యుత్తు దుర్వినియోగం కాకుండా సంబంధిత అధికారులు పర్యవేఽక్షించాల్సి ఉంటుంది.