Share News

Sridhar Babu: పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి కేంద్రం

ABN , Publish Date - Oct 09 , 2024 | 02:59 AM

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Sridhar Babu: పారిశ్రామికవేత్తలకు  అభివృద్ధి కేంద్రం

  • అహ్మదాబాద్‌ సంస్థ సాయంతో నిర్వహణ

  • నాలుగేళ్లలో 50 వేల మందికి శిక్షణ లక్ష్యం

  • 6 నెలల పాటు అండగా అభివృద్ధి కేంద్రం

  • ఈడీఐఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

  • శ్రీధర్‌బాబుతో సంస్థ డీజీ సమావేశం

  • హైదరాబాద్‌లో తైవాన్‌ పారిశ్రామిక పార్క్‌

  • ఎంఎ్‌సఎంఈల్లో మహిళలకు ప్రాధాన్యం

హైదరాబాద్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఇందుకోసం అహ్మదాబాద్‌లోని ఆంట్రప్రనర్‌షిప్‌ డెవల్‌పమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఈడీఐఐ) భాగస్వామ్యంతో నగరంలో పారిశ్రామికవేత్తల అభివృద్ధి కేంద్రం(ఈడీసీ) ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చిన ఇడిఐఐ డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌ శుక్లాతో మంత్రి మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. నగరంలో ఏర్పాటు చేయబోయే అభివృద్ధి కేంద్రంతో నాలుగేళ్లలో 50 వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తామని శ్రీధర్‌బాబు ప్రకటించారు.


ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. ఏటా కనీసం 5 వేల మందికి సొంతంగా ఉపాధి కల్పించుకునేలా శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత కూడా ఆరు నెలల వరకు ఈడీసీ సహకారం అందిస్తుందని వెల్లడించారు. కోవిడ్‌ సమయంలో అమ్మకాలు లేక నష్టపోయిన ఎంఎ్‌సఎంఈ లకు ఆర్థిక సహకారం అందించి కోలుకునేలా చేస్తామని శ్రీధర్‌ బాబు ప్రకటించారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థల తరహాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓఎన్‌డీసీ(ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌)తో ఉచితంగా మార్కెటింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. తైవాన్‌ నుంచి పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా నగరంలో తైవాన్‌ పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్టు టీజీఐఐసీ ఎండీ విష్ణు తెలిపారు.


టీజీఐఐసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ, తైవాన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీసీసీ) మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ, తైవాన్‌ నుంచి పెట్టుబడులను రాబట్టేందుకు టీసీసీ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు. తైవాన్‌ కంపెనీలు రాష్ట్రానికి రావడంలో టీసీసీ కీలక మాధ్యమంగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో తైవాన్‌ పారిశ్రామిక పార్క్‌ రూపకల్పన ఇప్పటికే జరిగిందన్నారు. కాగా, ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ) విధానంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. బీసీ, దళిత పారిశ్రామిక వేత్తలకూ కొత్త విధానంలో నిర్దేశించిన ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను కోరారు.


పరిశ్రమల శాఖ జిల్లాల జనరల్‌ మేనేజర్ల రాష్ట్ర స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. కొత్త ఎంఎ్‌సఎంఈ పాలసీకి సంబంధించి మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంఎ్‌సఎంఈ కొత్త విధానం హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. ఎంఎ్‌సఎంఈ పథకాల వివరాలు, ప్రభుత్వ రాయితీలు, రుణాలు పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు చేసే విధానంతో సహా అన్ని వివరాలు హ్యాండ్‌ బుక్‌లో ఉన్నాయని శ్రీధర్‌ బాబు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటులో వృద్థి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయలని కోరారు. బీసీలు ప్రధాన లబ్దిదారులుగా ఉన్న పీఎం విశ్వకర్మ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. మరో పదేళ్లలో తెలంగాణ ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో పరిశ్రమల శాఖదే కీలక బాధ్యత అని చెప్పారు.

Updated Date - Oct 09 , 2024 | 02:59 AM