Independence Day: ఎట్ హోంకు సీఎం రేవంత్..
ABN , Publish Date - Aug 16 , 2024 | 02:58 AM
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.
డుమ్మా కొట్టిన బీఆర్‌ఎస్ నాయకులు
గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆర్‌ఎస్ నాయకులు గైర్హాజరయ్యారు. కార్యక్రమానికి వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. వర్షంలోనే గవర్నర్ అతిథుల్ని కలిశారు. వర్షం నీరు కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణంలోకి వచ్చి చేరడంతో కొందరు అతిథులు కార్యక్రమం ముగియకముందే అక్కడి నుంచి వెనుదిరిగారు.
జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్ దర్బార్ హాల్ వద్ద గురువారం ఉదయం జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది, గవర్నర్ ముఖ్య సలహాదారు బుర్రా వెంకటేశం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జన్మదిన వేడుకలు రాజ్‌భవన్‌లో గురువారం నిరాడంబరంగా జరుపుకొన్నారు. యాదాద్రి వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు.