Share News

Global AI Summit: ఏఐ సిటీలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌..

ABN , Publish Date - Sep 07 , 2024 | 04:38 AM

ప్రపంచ కృత్రిమ మేధ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతిపాదిత ఏఐ సిటీలో ప్రపంచ స్థాయి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(డబ్ల్యూటీసీ) ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.

Global AI Summit: ఏఐ సిటీలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌..

  • 10 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు.. డబ్ల్యూటీసీఏతో రాష్ట్ర సర్కారు ఎంవోయూ

  • ఈ సెంటర్‌ పూర్తయితే ఐటీ ఎగుమతులు 200 బిలియన్‌ డాలర్లకు : మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ కృత్రిమ మేధ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతిపాదిత ఏఐ సిటీలో ప్రపంచ స్థాయి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(డబ్ల్యూటీసీ) ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికే శంషాబాద్‌, జీనోమ్‌ వ్యాలీలో రెండు వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఏఐ సిటీలో మరో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ రానుంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రపంచ కృత్రిమ మేధ సదస్సు శుక్రవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరో డబ్ల్యూటీసీని ఏర్పాటు చేయడానికి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌(డబ్ల్యూటీసీఏ) ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో డబ్ల్యూటీసీఏ ప్రతినిధులు అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నారు.


ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘ఫోర్త్‌ సిటీ’ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందులోనే 10 లక్షల(మిలియన్‌) చదరపు అడుగుల విస్తీర్ణంతో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ కృత్రిమ మేధ రంగంలో అత్యధిక విస్తీర్ణంతో ఏర్పాటవుతున్న సెంటర్‌ ఇదే కావడం గమనార్హం. ఇందులో ప్రపంచ స్థాయి ఆఫీస్‌ స్పేస్‌, వాణిజ్య సేవలు, శిక్షణ సౌకర్యాలు, చిల్లర వ్యాపారం, ఇతర వినోద జోన్లు, నివాస ప్రదేశాలు, విలాసవంతమైన హోటల్‌, ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక మినీ సిటీని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభిమతం మేరకు డబ్ల్యూటీసీ ఏర్పాటు కానుంది. ‘వాక్‌-టు-వాక్‌’ విధానంలో ఇక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తారు.


అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... ఏఐ సిటీలో మరో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఏర్పాటు కానుండడంతో రాష్ట్ర నుంచి ఐటీ ఎగుమతులు 32 బిలియన్‌ డాలర్ల నుంచి 200 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో మమేకమై ఆర్థిక వృద్ధిని సాధిస్తుందనడానికి, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందనడానికి ఇదే తార్కాణమని అన్నారు. ఏఐని పూర్తిగా ప్రజాస్వామ్యీకరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దీని ఫలాలను అన్ని వర్గాలకు సమానంగా పంచుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి సాధించాలంటే ఏఐ సేవలు అవసరమని అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాబిన్‌ వాన్‌ పుయెన్‌బ్రోక్‌ మాట్లాడుతూ ఏఐ సిటీలో ఏర్పాటు చేసే డబ్ల్యూటీసీకి తెలంగాణ ప్రభుత్వం వెంటనే లైసెన్స్‌ మంజూరు చేయడాన్ని అభినందించారు. కొత్త వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లకు లైసెన్సులు పొందడం సుదీర్ఘ కసరత్తు అని, ఇక్కడ రికార్డు స్థాయిలో వారంలోనే లైసెన్సు పొందామన్నారు.


వైద్య రంగంలో ఏఐతో సమస్యలూ ఉన్నాయ్‌!

  • దేశంలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధ అమల్లోకి

  • రావాలంటే ఇంకా ఐదారేళ్లు పడుతుంది

  • ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ)తో వైద్య రంగంలో సమస్యలు కూడా ఏర్పడవచ్చని ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో పలు సమస్యలు ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ ఏఐ సదస్సులో భాగంగా శుక్రవారం ‘ఏఐ- ట్రాన్స్‌ఫార్మింగ్‌ పేషెంట్‌ కేర్‌- డయాగ్నసిస్‌ అండ్‌ ట్రీట్మెంట్‌’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో మాట్లాడారు. భారత్‌లో సైబర్‌ సెక్యూరిటీ అతిపెద్ద సమస్య అన్నారు.


ఇటీవలే ఎయిమ్స్‌ సమాచారాన్ని చైనాకు చెందిన హ్యాకర్లు తస్కరించారని గుర్తుచేశారు. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల వద్ద ఉన్న రోగుల డేటా భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ లేకుండా ఏఐ వినియోగం ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. అమెరికా ఆస్పత్రుల్లోని 80 శాతం వెంటిలేటర్లు ఏఐ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటాయని, వాటిని ఎక్కడి నుంచైనా నియంత్రించవచ్చని చెప్పారు. అక్కడ పటిష్ఠ వ్యవస్థ అందుబాటులో ఉన్నందున ఏఐ సాంకేతికతను విజయవంతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. కానీ, భారత్‌లో ఇంకా అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇక్కడ వైద్య రంగంలో ఏఐ పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే ఐదారేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 04:38 AM