Share News

TG : స్థానికంలో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు

ABN , Publish Date - Aug 07 , 2024 | 04:37 AM

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ల నిర్ధారణకు సుప్రీం కోర్టు నిర్దేశించిన ట్రిపుల్‌ టెస్ట్‌ మార్గదర్శకాల అమలుకు ఎంత సమయం పడుతుందో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

TG : స్థానికంలో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు

  • ట్రిపుల్‌ టెస్ట్‌ ఎప్పటికి పూర్తిచేస్తారు?

  • 27 లోగా వివరాలు తెలియజేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ల నిర్ధారణకు సుప్రీం కోర్టు నిర్దేశించిన ట్రిపుల్‌ టెస్ట్‌ మార్గదర్శకాల అమలుకు ఎంత సమయం పడుతుందో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 27లోగా సమాధానం తెలియజేయాలని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం పేర్కొంది.

‘స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్‌ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేయడానికి పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధ, డెడికేటెడ్‌ కమిషన్‌ ఉండాలి. ఈ కమిషన్‌ జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్‌లను నిర్ధారించాలి.

అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌లన్నీ కలిపినా 50% మించకూడదు. బీసీ కమిషన్‌ రిజర్వేషన్లను నిర్ధారించకపోతే స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లే కొనసాగుతాయి’ అని సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్‌ల కల్పనకు ట్రిపుల్‌ టెస్ట్‌ను నిర్దేశించింది. కాగా, బీసీల జనాభా వివరాల సేకరణ, సర్వేల నిర్వహణకు ‘తెలంగాణ బీసీ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ను ప్రభుత్వం ఎంచుకోవడం రాజ్యాంగ వ్యతిరేకమని..

స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్‌తో రిజర్వేషన్లు స్థిరీకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తెలంగాణ బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఇతరులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టింది. రిజర్వేషన్‌లు స్థిరీకరించకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పిటిషనర్‌ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.


సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్‌ ఉల్లంఘిస్తున్నారు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై 3 నెలలలోపు నిర్ణయం తీసుకోకుండా సుప్రీం కోర్టు తీర్పులను అసెంబ్లీ స్పీకర్‌ ఉల్లంఘిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద్‌, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.

వీటిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ కొనసాగించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరఫున గండ్ర మోహన్‌రావు వాదించారు. ‘కైశం మేఘాచంద్రసింగ్‌, రాజేంద్రసింగ్‌ రాణా, కిహోటో హోలోహన్‌’ తీర్పులను మహారాష్ట్ర సంక్షోభానికి సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు పునరుద్ఘాటించిందని.. మూడు నెలల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించిందని పేర్కొన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 04:37 AM