Share News

Vikarabad: ఉద్యోగులపై దాడి.. హేయమైన చర్య

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:04 AM

వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో పాటు రెవెన్యూ అధికారులపై దాడిని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు.

Vikarabad: ఉద్యోగులపై దాడి.. హేయమైన చర్య

  • బాధ్యులను కఠినంగా శిక్షించాలి

  • తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం

  • నిజామాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద రెవెన్యూ ఉద్యోగుల నిరసన

  • దాడిని ఖండించిన ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌/ నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో పాటు రెవెన్యూ అధికారులపై దాడిని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి హేయమైన చర్య అని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారులపై రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు దాడికి పాల్పడ్డాయని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘంరాష్ట్ర అధ్యక్షుడు కె. చంద్రమోహన్‌, ప్రధానకార్యదర్శి డి.శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. ఇదే విషయమై తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ లచ్చిరెడ్డి సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ, అధికారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దాడికి ఉసిగొల్పిన, పాల్పడిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై దాడిని ట్రెసా తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గౌతమ్‌ కుమార్‌ తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ పింఛనుదారుల ఐకాస చైౖర్మన్‌ కె.లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. రైతుల ముసుగులో దాడి చేయడం హేయమైన చర్య అని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధానకార్యదర్శి ఎ.సత్యనారాయణ పేర్కొన్నారు. ఉద్యోగులతో కలిసి కొత్తగూడెంలో నల్లరిబ్బన్లతో వారు నిరసన తెలిపారు. దాడికి దిగడం సమంజసం కాదని ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి పద్మావతి పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న కలెక్టర్‌తో పాటు సిబ్బందిపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన తెలిపారు.

Updated Date - Nov 12 , 2024 | 04:04 AM