Cyber Fraud: అద్దెకు బ్యాంకు ఖాతాలు!
ABN , Publish Date - Nov 14 , 2024 | 04:21 AM
కమీషన్ల కోసం కక్కుర్తిపడి సైబర్ నేరగాళ్లు లావాదేవీలు చేసుకునేందుకు బ్యాంకు ఖాతాలను ఇస్తోన్న ఓ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో నమోదైన 508 సైబర్ నేరాల్లో నిందితులుగా ఉన్న ఓ ముఠాకు చెందిన 48 మందిని అరెస్ట్ చేశారు.
కమీషన్ల కోసం సైబర్ నేరగాళ్లకు అకౌంట్ వివరాలు
తెలంగాణలో 48 మంది అరెస్టు
రూ. 8.16 కోట్లు కొట్టేసిన ముఠా
ముఠా సభ్యులపై రాష్ట్రంలో 508 కేసులు
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కమీషన్ల కోసం కక్కుర్తిపడి సైబర్ నేరగాళ్లు లావాదేవీలు చేసుకునేందుకు బ్యాంకు ఖాతాలను ఇస్తోన్న ఓ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో నమోదైన 508 సైబర్ నేరాల్లో నిందితులుగా ఉన్న ఓ ముఠాకు చెందిన 48 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 10 మంది ఏజెంట్లు, కమీషన్ల కోసం బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారు 38 మంది ఉన్నారు. వీరిలో క్యాబ్ డ్రైవర్లు, చిరుద్యోగులతోపాటు ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరి నుంచి 53 సెల్‌ఫోన్లు, 4 ల్యాప్‌టా్‌పలు, 18 బ్యాంకు పాస్ పుస్తకాలు, 16 చెక్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులకు సంబంధించిన వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) డైరెక్టర్ శిఖా గోయల్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. తాము అరెస్టు చేసిన వారిపై దేశవ్యాప్తంగా 2,194 కేసులు ఉన్నాయన్నారు. ఈ ముఠా ప్రజలను మోసగించి రూ.8.16 కోట్లు కొల్లగొట్టిందని చెప్పారు.
కమీషన్లకు ఆశపడి..
సైబర్ నేరగాళ్ల కోసం రాష్ట్రంలో ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు వివరాలు సేకరించి ఈ ఏజెంట్లే బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్లు తెరుస్తుంటారు. ఇందుకుగాను సైబర్ నేరగాళ్లు తమకు ఖాతా ఇచ్చిన వారికి కమీషన్ కింద కొంత మొత్తం చెల్లిస్తుంటారు. ఒక్కో ఖాతాను గరిష్ఠంగా మూడు నెలలే వాడే సైబర్ నేరగాళ్లు ఒక్కో ఖాతాలో 2 లేదా 3 లావాదేవీలు మాత్రమే చేస్తారు. ప్రధాన నిందితులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో ఏజెంట్లు, ఖాతాలు సమకూర్చిన వారికి కమీషన్ బదిలీ చేసి మిగిలిన మొత్తాన్ని అంతర్జాతీయ ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు.
ఖమ్మం వాసిపై 688 కేసులు..!
కమీషన్ కోసం సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన కొండల్‌రావు అనే వ్యక్తిపై దేశ వ్యాప్తంగా 688 కేసులు నమోదయ్యాయి. కొండల్ రావు తన భార్య ఖాతాను కూడా సైబర్ నేరగాళ్లకు ఇచ్చాడని, వీరి ఖాతాల నుంచి కోట్ల రూపాయలు దారిమళ్లాయని పోలీసులు గుర్తించారు. అలాగే, హైదరాబాద్, హఫీజ్‌పేట్ ప్రాంతానికి చెందిన అక్షయ్ కుమార్‌పై దేశవ్యాప్తంగా 136 కేసులు నమోదయ్యాయి. కమీషన్ల కోసం సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చి అరెస్టయిన వారిలో క్యాబ్ డ్రైవర్ల నుంచి ఐటీ ఉద్యోగుల వరకు వివిధ వర్గాల వారున్నారు. ఇప్పటిదాకా అరెస్టయిన వారి బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆయా బ్యాంకుల అధికారుల పాత్రపై కూడా వారు దృష్టి సారించారు.